AP Minister Gudivada Amarnath on 3 capitals:  వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 90 హామీలు నేరవేర్చిందని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఇంకా సమయం ఉన్నందున మిగిలిన హామీలను సైతం ఒక్కొక్కటిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తామన్నారు. 2024 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అంతకుముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ కీలక అంశంపై చర్చిస్తామని తెలిపారు. 


ఏపీ ప్రాజెక్టులు వద్దని లేఖలు రాస్తారా ?
బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి వస్తుంటే అంతా సంతోషిస్తున్నారని.. కానీ టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల అది వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడాన్ని మంత్రి అమర్‌నాథ్ తప్పుపట్టారు. దావోస్ సదస్సులో ఏపీలో పరిశ్రమల స్థాపనతో పాటు నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడానికి విదేశీ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎన్నో ఒప్పందాలు చేసుకుందన్నారు. ఫార్మా రంగానికి హబ్‌గా ఏపీ మారబోతోందని, ఏ పరిశ్రమ వచ్చినా డెవలప్‌మెంట్ కోసం తాము వారిని స్వాగతిస్తామని చెప్పారు. అమర్‌రాజా సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై పీసీబీ విచారణ జరిపి నిర్ధారిస్తే టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. 


విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు, మాజీ మంత్రి యనమల ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రజల కోసం అప్పులు తెస్తుందని, కానీ వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తుంటే మాత్రం.. ప్రతిపక్ష టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఏపీకి అప్పులు ఇవ్వొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, ప్రముఖ బ్యాంకులకు లేఖలు రాశారని విమర్శించారు. 


ఈ 7న ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ సెప్టెంబర్ 7కు వాయిదా పడింది. మొదట సెప్టెంబర్ 1న కేబినెట్ భేటీ అనుకున్నారు. కానీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) మూడు రోజుల కడప జిల్లా పర్యటన కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 7కు వాయిదా వేశారు. సెప్టెంబర్ 1న గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు వెళ్లిన సీఎం జగన్.. 2వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి అక్కడే బస చేసిన సీఎం వైఎస్ జగన్ నేటి ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నట్లు సమాచారం.


Also Read: Face Recognition Attendance: టీచర్లకు ముఖ ఆధారిత హాజరు ఉన్నట్లా, లేనట్టా - అసలేం జరుగుతోంది ! నెగ్గేదెవరు


Also Read: Sajjala On Chandrababu : చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డదారిన సీఎం అయ్యారు- సజ్జల రామకృష్ణారెడ్డి