Peela Govind Interesting Comments: అనకాపల్లి తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసంతృప్తి దాదాపు సద్ధుమణిగినట్టు కనిపిస్తోంది. ఈ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ కేటాయించారు. కొణతాలకు సీటు కేటాయించిన విషయం తెలిసిన తరువాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి. ఇక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు సంఘీభావం తెలిపారు. పార్టీ అధినాయకత్వ తీరును తీవ్రంగా ఖండించిన పలువురు కార్యకర్తలు పార్టీని వీడాలంటూ గోవింద్‌కు సూచించారు. ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ తరహా ఊహాగానాలకు చెక్‌ చెప్పేలా పీలా గోవింద్‌ సత్యనారాయణ స్పందించారు. తన నివాసం వద్ద బుధవారం సాయంత్రం కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదే ఇంటిలో.. ఇదే పార్టీలో.. ఇదే కుటుంబంతో ఉంటానని స్పష్టం చేయడం ద్వారా పార్టీలో మారుతున్నట్టు వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. 


సంయమనం పాటించాలంటూ కేడర్‌కు సూచన


తనకు టికెట్‌ రాలేదని కేడర్‌ ఆందోళన చెందవద్దని, అధినేత, పార్టీపై తూలనాడొద్దు అంటూ కేడర్‌కు గోవింద్‌ సూచించారు. సంయమనం పాటించాలంటూ కోరారు. 2019లో ఓటమి తరువాత ఇదే ఇంటిలో ఉంటానని తాను చెప్పానని.. ఇప్పటికీ ఉంటున్నానని, భవిష్యత్‌లోనూ ఉంటానని స్పష్టం చేశారు. యలమంచిలి, పెందుర్తికి వెళతానంటూ ప్రచారం జరుగుతోందని.. తానెక్కడా దుకాణం పెట్టనని, ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. సీటుతో తనకు పనికి లేదన్న గోవింద్‌.. ఎమ్మెల్యే అవుతానని తానెప్పుడూ ఊహించలేదని, చంద్రబాబు దయతో అయ్యానన్నారు. నా తండ్రి మీద అభిమానంతో చంద్రబాబు సీటు ఇచ్చినప్పుడు ఎంతో మంది ఆందోళనలు చేశారని, అయినా చంద్రబాబు పట్టించుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో ఓడిన తరువాత కార్యకర్తలు ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకున్నానని.. సీటు వచ్చినా, రాకపోయినా కుటుంబ సభ్యుడిగా ఉంటానని పీలా గోవింద్‌ పేర్కొన్నారు. 


టీడీపీని వీడే వారికి మనుగడ ఉండదు


తెలుగుదేశం పార్టీని కోపతాపాలతో వీడి వెళ్లేవారికి మనుగడ ఉండదని పీలా గోవింద్‌ పేర్కొన్నారు. ఒకవేళ వెళ్లినా మళ్లీ ఇదే పార్టీలోకి వస్తారని వెల్లడించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్న గోవింద్‌.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని.. 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నట్టుగానే.. రానున్న ఐదేళ్లు చేసుకుందామని స్పష్టం చేశారు. కొణతాలతో తనకు వైరం లేదని వెల్లడించారు. గతంలో గుడివాడ అమర్‌ తన ఇంటికి వచ్చాడన్నారు. నాలుగురోజులు ఆగమని చంద్రబాబు చెప్పారన్నారు. స్వప్రయోజనాలు కోసం జెండా మార్చే అలవాటు లేదని, పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయనని స్పష్టం చేశారు. ఎన్‌టీఆర్‌, చంద్రబాబు దగ్గర నుంచి తన తండ్రి, తాను పని చేస్తూ వచ్చామని, భవిష్యత్‌లో లోకేశ్‌ నాయకత్వంలో పని చేస్తామని గోవింద్‌ స్పష్టం చేశారు. ఐదేళ్లు చాలా కష్టపడ్డామని, 4900 మంది కార్యకర్తలు పింఛన్లు తీసేశారని, ఏ రోజూ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.