Vizag Latest News:  సరిగ్గా గమనిస్తే ఏపీలోని ప్రధాన పొలిటికల్ పార్టీలన్నీ వైజాగ్ మీదే పూర్తి ఫోకస్‌తో పని చేస్తున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ముద్ర వేసిన ఆయా పార్టీలు ఇప్పుడు వైజాగ్ తమ కార్య స్థానంగా చేసుకోవాలని చూస్తున్నాయి. వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం వ్యాపించాలనేది వాటి వ్యూహంగా స్పష్టం అవుతోంది. 

వైజాగ్‌ను IT హబ్‌గా మార్చామనే క్రెడిట్ కోసం టీడీపీ ప్రయత్నం 

ప్రస్తుతం ఏపీలో టిడిపికి అత్యంత బలమైన ప్రాంతం ఏది అంటే అమరావతి అనే చెప్పాలి. 2019 నుంచి 2424 మధ్యలో జరిగిన పరిణామాలు అమరావతి ప్రాంతంలో టిడిపిని బలమైన శక్తిగా మార్చాయి. అక్కడ రైతులు గ్రామస్తులు టిడిపికి పూర్తి పట్టం కట్టారు. దానితో పాటు వైజాగ్‌ను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుంటే రాజకీయంగా తిరుగు ఉండదని టిడిపి భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి భావి అధినేత నారా లోకేష్ పదే పదే వైజాగ్ వెళ్లడం పెద్ద కార్యక్రమాలన్నిటికీ వైజాగ్‌ని వేదిక చేసుకోవడం ఆ పార్టీ వ్యూహంపై స్పష్టతనిస్తోంది. అలాగే గూగుల్ టిసిఎస్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు వైజాగ్‌ని కేంద్రంగా చేస్తూ ఈ రాష్ట్రంలో మరో సైబరాబాద్‌గా విశాఖకు గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం ఉంది. అమరావతి తోపాటు వైజాగ్‌పై కూడా పూర్తి పట్టు సాధిస్తే భవిష్యత్తులో అడ్డే ఉండదనేది టిడిపి వ్యూహం అంటున్నారు ఎనలిస్ట్ లు 

రాయలసీమతోపాటు వైజాగ్ కూడా మాదే అంటోన్న వైసీపీ

రాయలసీమ జిల్లాల్లో బలంగా ఉన్న వైసిపి రాజధాని ప్రాంతంలో మాత్రం బాగా దెబ్బతింది. మూడు రాజధానుల బిల్లు తేవడం, అమరావతి రైతులపై నిర్బంధం వంటివి ఆ ప్రాంత ప్రజలు వైసిపికి దూరం జరిగేలా చేశాయి. ఇప్పటికీ అమరావతిపై పార్టీ స్టాండ్ ఏమిటి అనేది కింది స్థాయి నేతలకూ అర్థం కావడం లేదు. కానీ వైజాగ్‌ను మాత్రం తమ కార్యక్రమాలకు వేదికగా చేసుకోవాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ చాలా ప్రాధాన్యత కల్పించింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసిపి గెలిచుంటే వైజాగ్‌నే ఏపీకి రాజధానిగా మార్చేసి ఉండేది. ఆ మేరకు ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు కూడా.

అయితే 2019-24 మధ్య పార్టీ కీలక నేతలు విజయసాయిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లాంటి వాళ్ళ మధ్య కీచులాటలు రియల్ ఎస్టేట్ గొడవలు విశాఖలో పార్టీని దెబ్బతీశాయి. తర్వాత వైవీ సుబ్బారెడ్డిని అక్కడ కీలక నేతగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. 24 ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న వైసీపీ ఈమధ్య మళ్లీ దూకుడు పెంచుతోంది. బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లాంటి మాజీ మంత్రులు విశాఖ నుంచే ప్రస్తుత ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎలాగైనా ఉత్తరాంధ్రలో మళ్ళీ బలపడాలనేది వైసీపీ ఆలోచన. రాయలసీమలో తాము బలంగా ఉన్నామని ఉత్తరాంధ్రలో కూడా బలపడితే తమ కొట్టే ఉండదనేది వైసిపి వ్యూహంగా కనిపిస్తోంది అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

గోదావరి జిల్లాలే కాదు.. వైజాగ్ లో అదరగొడతాం అంటున్న జనసేన 

జనసేన మొదటి నుంచి వైజాగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గోదావరి జిల్లాలు జనసేనకు అంతకుముందు ప్రజారాజ్యానికి అండగా ఉన్న మాట వాస్తవం. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఒక్క సీటు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి. అయినప్పటికీ విశాఖపై పవన్ కల్యాణ్‌ ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భీమవరంతోపాటుగా గాజువాక నుంచి కూడా పోటీ చేశారు. కానీ గెలిస్తే ఆయన అక్కడ స్థానికంగా ఉండరు అనే ప్రచారం ఎక్కువగా జరగడంతో గాజువాకలో ప్రజలు ఓటు వేయలేదు అని జనసేన చెబుతోంది.

2019-2024 మధ్య పవన్ కల్యాణ్ వైజాగ్‌లో ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో నోవాటెల్ ఇన్సిడెంట్ ఆయనకు పెద్ద ప్రచారం కల్పించింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఫోకస్ ఎక్కువగా ఉత్తరాంధ్ర మన్యం ప్రాంతాలపైన ఉంది. స్వయంగా అక్కడ పర్యటించడం, రోడ్లు వేయించడం వంటి కార్యక్రమాలతో పాటుగా ఇటీవల "సేన తో సేనాని" కార్యక్రమాన్ని కూడా వైజాగ్ లోనే నిర్వహించారు పవన్ కల్యాణ్. మెట్రోపాలిటన్ సిటీ అయినందన అన్ని అవకాశాలు ఉన్న విశాఖలో యంగ్ జనరేషన్ ని ఆకట్టుకుంటే జనసేనకు అడ్డే ఉండదనేది ఆయన ఆలోచన. గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు జనసేన ముద్ర బలంగా వేసే వ్యూహంలో పవన్ కల్యాణ్‌ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఏపీ పాలిటిక్స్ కి ముఖద్వారంగా వైజాగ్ ను భావిస్తోన్న బీజేపీ 

ఎలాగైనా ఏపీలో బలపడాలని చూస్తున్న బిజెపికి మిగిలిన ఏకైక మార్గంగా వైజాగ్ కనిపిస్తోంది. అందుకే గతంలో కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజు ఇలాంటి వాళ్లకు బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన కమలం పార్టీ మొన్నటి వరకు ఒకప్పుడు వైజాగ్ ఎంపీగా పని చేసిన పురందేశ్వరి, ప్రస్తుతం వైజాగ్ వాసి మాధవ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. వైజాగ్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన జనాభా ఎక్కువగా ఉండటం వాళ్లలో బిజెపికి పట్టు ఉండడంతో ముందు ఆ ప్రాంతంలో బలపడితే తర్వాత నెమ్మదిగా ఏపీలోని మిగతా ప్రాంతాలకు విస్తరించ వచ్చనేది వారి ఆలోచన.

ఉమ్మడి చిత్తూరు మినహా రాయలసీమలో వైసిపి, అమరావతి ప్రాంతంలో టీడీపీ, గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైజాగ్‌ను ఒక అవకాశంగా బీజేపీ భావిస్తోంది అన్న మాట వినిపిస్తోంది. జీవీఎల్ నరసింహారావు లాంటి బీజేపీ నేతలు కూడా నెమ్మదిగా వైజాగ్‌లో పార్టీని విస్తరించే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీలూ రాజకీయంగా వైజాగ్‌లో ముద్ర వేసే ప్రయత్నంలో పోటీ పడుతున్నాయి. ఇంతకూ వైజాగ్ సహా ఉత్తరాంధ్ర వాసులు ఏ పార్టీని అక్కున చేర్చుకుంటారో కాలమే తేల్చాలి.