Ganesh Shobha Yatra: ఏపీలో గణేశ్ శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. గణేశ్ శోభాయాత్రలో పాల్గొన్న వారిని వాహనాలు ఢీకొన్న రెండు వేర్వేరు ప్రమాలలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గణేశ్ శోభాయాత్ర సందర్భంగా ఓ ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి భక్తులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తూర్పుతాళ్ల గ్రామానికి చెందిన దినేష్ (10), నరసింహమూర్తి (32), మురళి (33), సూర్యనారాయణ (52)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో విషాదం
ఈ రోజు రాత్రి 9 గంటల సమయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, హుటాహుటిన నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆమె ఆదేశించారు.
ప్రమాదానికి గురైన ఐదుగురు మొగల్తూరు మండలం తూర్పు తాళ్ల గ్రామానికి చెందినవారు. ఈ దుర్ఘటనకు అసలైన కారణం ట్రాక్టర్ డ్రైవర్ మంచినీళ్లు త్రాగేందుకు కిందకు దిగిన వేళ, ట్రాక్టర్‌లో ఉన్న ఓ చిన్నారి అప్రమత్తత లేకుండా వాహనాన్ని స్టార్ట్ చేయడం వల్లే జరిగినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో మృతులు: ఈవన సూర్యనారాయణ (58), గురుజు మురళి (38), తిరుమల నరసింహమూర్తి (35), కడియం దినేష్. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
గణేశ్ శోభాయత్రలో అపశ్రుతి.. స్కార్పియో ఢీకొని ఇద్దరు భక్తులు మృతిపాడేరు: గణేశ్ నిమజ్జనంలో భాగంగా చేస్తున్న శోభాయాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధిలో జరుగుతున్న శోభాయాత్రలో స్కార్పియో వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. శోభాయాత్ర చేస్తున్న భక్తులపైకి స్కార్పియో వాహనం దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి గాయాలు కాగా, సమీపంలోని పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తు ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.