అనకాపల్లి జిల్లా ఏజెన్సీలో బుధవారం పులి సంచారం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. కోటవురట్ల మండలం టి.జగ్గపేట శివారు శ్రీరాంపురంలో చిన్న అనే రైతుకు చెందిన గేదెపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో గేదె మృత్యువాత పడటంతో  సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగు జాడలను గుర్తించి సమీప గ్రామ ప్రజలను అలెర్ట్ చేశారు. అయితే దాడి చేసింది పెద్ద పులా..లేక చిరుతా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.


నెల రోజులుగా కాకినాడ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన పులి ఇప్పుడు రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. ముందుగా విజయనగరంలో సంచరించిన పులి తర్వాత కాకినాడ జిల్లాలోకి ప్రవేశించి. అప్పటి నుంచి పదే పదే రూట్ మారుస్తూ అధికారులను ఏమారుస్తోంది. ఇదిగో పులి అదిగో పులి అంటూ పరుగులు పెట్టడమే తప్ప పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మొదట్లో బోనులో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. 


అప్పటి నుంచి పులి కోసం వేట కొనసాగుతోంది. వేట ముమ్మరమైనప్పుడు సైలెంట్‌ అయిపోతున్న పులి... కాస్త హడావుడి తగ్గాక పశువులపై దాడి చేసి మళ్లీ వెలుగులోకి వస్తోంది. ఇలా ప్రజలు, అధికారులతో ఓ ఆట ఆడుకుంటోంది. కాకినాడ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పులి పాదముద్రల కోసం అన్వేషిస్తున్న అటవీ శాఖ అధికారులకు పెద్ద పులి ఆనవాళ్లు కాకినాడ జిల్లా పరిధిలోని రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెంలో కనిపించాయి. రౌతులపూడి మండలం లోని ఎస్. పైడి పాల గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చిరెడ్డి పాలెంలో పులి పాద ముద్రలు కనిపించడంతో అధికారులతోపాటు ప్రజలు మళ్లీ అప్రమత్తమయ్యారు. అయితే ఎన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేసి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా పెద్దపులి అంచనాలకు అందడం లేదు. బోనులో చిక్కుకోవడం. బోను వరకు వచ్చి వెళ్లిపోయినట్లు కొన్ని చోట్ల పాదముద్రల్ని చూసి అధికారులు నిర్థారించారు.


మొన్నటికి మొన్న అన్నవరానికి అత్యంత సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. పులి పాదముద్రలు గుర్తించిన చోటు నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అన్నవరం సత్యదేవుని ఆలయం ఉంది. కానీ పెద్దపులి అటువైపుగా వెళ్లే అవకాశం లేదని అటవీ అధికారులు చెప్పడంతో అన్నవరం వెళ్లే భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అనకాపల్లిలో సంచరిస్తుందన్న వార్త కలకలం రేపుతోంది. బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పశువులకు కాపాల కాయ లేక వాటిని ఒంటరిగా వదల్లేక ఇబ్బంది పడుతున్నారు.