విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు వద్దంటూ ఉద్యోగులు, కార్మికులు ఏకధాటిగా చేస్తున్న ఉద్యమం 600రోజులకు చేరుకుంది . వివిధ వర్గాల నుంచి మద్దతు తీసుకుంటున్న ఉద్యమకారులు... ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదంటున్నారు. తమ పోరాటం ప్రారంభించి 600 రోజులు పూర్తయిన సందర్భంలో నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలియ జేస్తామంటున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు.
స్టీల్ ప్లాంట్ అమ్మకం తప్పనిసరి అంటున్న కేంద్రం
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా పిలిచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు 26 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పేరుమీదే విశాఖ నగరానికి ఉక్కునగరం అనే పేరు స్థిరపడింది. ప్రారంభంలో ఏడాదికి 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలైన
స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7. 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యక్షంగా 17,500 మంది ఉద్యోగులూ, పరోక్షంగా లక్ష మంది ఈ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి పని చేస్తున్నారు.
ఈ సంస్థ నష్టాల్లో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించడంతో ఏడాది క్రితం ఆందోళనలు మొదలయ్యాయి. స్టీల్ ఉత్పత్తుల్లో అనేక రికార్డులు సాధించిన స్టీల్ ప్లాంట్ 2015 నుంచి వరుసగా నష్టాలను చవిచూస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడమీ దీనికి ప్రధాన కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి. జిందాల్ లాంటి ప్రైవేటు సంస్థలకు గనులను కేటాయించిన ప్రభుత్వం... విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం ఆ పని చేయడం లేదు. సొంత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. దీంతో గత కొన్నేళ్లుగా సంస్థ నష్ఠాలను నమోదు చెస్తోంది. దీన్ని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటు పరే చేయాలని రంగం సిద్ధం చేసింది.
నిజానికి 2015 వరకూ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బానే ఉంది. కానీ ఉక్కు పరిశ్రమలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, ఐరన్ ఓర్‌ను ప్రైవేటుగా కొనుగోలు చెయ్యాల్సిన పరిస్థితి రావడంతో 2015-16 నుంచి 2020 వరకూ 5 వేల కోట్లు వరకు నష్టం వచ్చిందని కేంద్రం అంటుంది. ప్లాంట్ ఆధునికీకరణ, విస్తరణ చేపట్టడం వలన కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దేశంలో స్టీలుకు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తులో మళ్లీ లాభాల బాటపట్టే అవకాశం ఉంది. కానీ సరిగ్గా ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి సంస్థను అమ్మేస్తామనడం సరికాదని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆంధ్రులు చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు . 1971లో ఈ సంస్థ కోసం 64 గ్రామాల నుంచి దాదాపు 26 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇదిగాక కురుపాం జమీందార్ 6వేల ఎకరాలను విరాళంగా ప్రకటించారు. భూములు ఇచ్చిన కుటుంబాల్లో సగం మందికే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అది అందరిదీ అనే అభిప్రాయంతో ప్రజలు సర్దుకుపోయారు. ప్రతీ ఏటా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి టాక్సుల రూపంలో వేలకోట్లు కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్నాయి. అయినప్పటికీ నష్ఠాల వంక చూపి స్టీల్ ప్లాంట్ ను అమ్మెయ్యాలని కేంద్రం చూస్తుంది .
స్టీల్ ప్లాంట్ భూములపైనే పెద్దల కన్ను: కార్మిక సంఘాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం దానికి ఉన్న భూములే అంటారు ఇక్కడి కార్మికులు. ప్లాంట్ విస్తరణ, భవనాల నిర్మాణం పోగా ఇంకా 8 వేల ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్‌ది ఖాళీగా ఉంది. దాన్ని చేజిక్కించుకునేందుకే ప్రైవేటు కంపెనీలు స్టీల్ ప్లాంట్ పై కన్నేసాయనేది వారి వాదన. వీటి విలువ దాదాపు లక్ష కోట్ల వరకూ ఉండడంతో వాటిపై ఆధిపత్యం కోసమే ఈ కుట్ర జరుగుతుంది అంటారు వాళ్ళు.
విచిత్రంగా ఇప్పుడు కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తున్న పోస్కో కంపెనీ గతంలో ఒడిశాలో ప్లాంట్ కోసం ప్రయత్నిస్తే ప్రాజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి అదే కంపెనీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా అప్పగిస్తారని కేంద్రాన్ని అడిగితే మాత్రం జవాబు లేదని ఉద్యోగ కార్మిక సంఘాలు అంటున్నాయి .
జాతీయ స్థాయిలో దద్దరిల్లిన నినాదం -" ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు "
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదు. దీని ఏర్పాటు కోసం ఆంధ్రులంతా ఏకతాటిపై పోరాటం చేశారు. 1966లో గుంటూరు ప్రాంతానికి చెందిన టి.అమృతరావు విశాఖలో దీక్ష ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో దీనిలో పాల్గొన్నారు. తరగతుల బహిష్కరణ, ఆందోళనలతో నిరసనలు పెద్ద ఎత్తున సాగాయి. రాజకీయ పక్షాలు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి. 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో 9మంది మరణించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. అవి కూడా పోలీసు కాల్పులకు దారితీశాయి. ఈ కాల్పుల్లో అదిలాబాద్, వరంగల్, విజయవాడ, విజయనగరం, తగరపువలస, కాకినాడ, సీలేరు, గుంటూరులలో మొత్తం 23 మంది మరణించారు. విశాఖతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇలా తెలుగువాళ్ళ ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ని ఎవరో ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పుతాం అంటే ఊరుకునేది లేదని అందుకే ఈ ఉద్యమం మొదలు పెట్టామని స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఒక పక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను ఈ ఏడాది లాభాల బాట పట్టించారు సంస్థ ఉద్యోగులు. గతంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ పెరగడంతోపాటు, విశాఖ ఉక్కుకు నాణ్యతపరంగా దేశవిదేశాల్లో మంచిపేరు ఉండడం దీనికి కారణం. ఇప్పటికే 57 కంపెనీలతో స్టీల్ అమ్మకంపై ఒప్పందాలు కూర్చుకోగా వాటిలో 30కి పైగా పూర్తి మొత్తం అడ్వాన్స్‌గా తీసుకుని స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో మళ్ళీ ఆదాయం రావడం మొదలైంది.
యాజమాన్య అధికార లెక్కల ప్రకారమే 2021లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 18వేల కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడ్డాక ఈ స్థాయి గణాంకాలు నమోదు చెయ్యడం ఇది రెండోసారి. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ 13శాతం వృద్ధి నమోదు చేసింది. చివరి నాలుగు నెలల్లో 740 కోట్ల రూపాయల నికర లాభం నమోదైంది. మార్చిలో లక్షల 11 వేల టన్నుల ఉక్కును 3 వేల 300 కోట్ల రూపాయలకు విక్రయించారు. గత మార్చి లో అయితే కర్మాగారం చరిత్రలో అత్యధిక ఆదాయం వచ్చింది. గత గరిష్టంతో పోల్చుకుంటే ఇది 42శాతం అధికం. దీనితో ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నమోదు చేస్తున్న లాభాలను దృష్టిలో పెట్టుకునైనా ప్రవేటీకరణ ఆలోచన మానుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నియమించిన కమిటీ ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుంటుందని వారు భావిస్తున్నారు .
600 రోజులకు చేరుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం
మొదట్లో వీరి ఉద్యమం నెమ్మదిగా మొదలైనా ,ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల మద్దతు వీరికి ఉంది. ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకుంటామని, అవసరమైతే తామే కొంటామని హామీ ఇచ్చింది. త్వరలోనే శుభవార్త వింటారని కూడా చెప్పడం విశేషం. ఇక ప్రతిపక్ష టీడీపీ కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అయితే ఏకంగా రాజీనామా వరకూ వెళ్లారు. జనసేన, వామపక్షాలు కూడా ఈ అంశంలో కార్మికుల ఉద్యమానికి సపోర్ట్ ఇస్తూనే ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ చెయ్యక తప్పదు అంటూ చెబుతుంది. జీవీఎల్ నరసింహారావు లాంటి బీజేపీ ఎంపీలు మాత్రం మంచే జరుగుతుంది అంటున్నారు. దానితో స్టీల్ ప్లాంట్ అమ్మకం వ్యవహారంలో అంతర్గతంగా ఏదో జరుగుతుంది. ప్రైవేటీకరణను ఆపొచ్చు అన్న ఆశాభవంలో ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు.
ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకూ ఉద్యోగుల్లో సగం మంది విధుల్లో ఉంటే మరికొంతమంది స్టీల్ ప్లాంట్ ముఖ ద్వారం వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఇలా ఏడాది పొడుగునా ఎన్ని కష్టాలు ఎదురైనా వారు తమ దీక్షను మాత్రం వదిలి పెట్టలేదు . ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తమ పట్టు వీడక పొతే మాత్రం తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామంటున్నారు వారు. ఢిల్లీలో రైతు ఉద్యమం విజయవంతం అయినట్టుగానే తమ పోరాటం కూడా సక్సెస్ అవుతుందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని కార్మిక, ఉద్యోగ సంఘాలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే నమ్మకం తో గత 600 రోజులుగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు వారు