Sailor's Hornpipe: విశాఖ(Visakha) వేదికగా నౌకా విన్యాసాలు మిలన్(Milan) 2022 జరుగుతోంది. నౌకాదళ సిబ్బంది చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ లో చేసిన హార్న్ పైప్ డ్యాన్స్ హైలెట్ గా నిలుస్తోంది. సీఎం జగన్ ముందు సీ కేడెట్ కార్ప్స్(Cadet Corps) బాలికలు ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. ఓడల్లో ప్రయాణించే నావికులు చేసే నృత్యమే ఈ హార్న్ పైప్ డాన్స్(Hornpipe Dance). 16వ శతాబ్దం నుంచి నేటి వరకూ అనేక నౌకా దళాల సైనికులు ఓడల్లో ప్రయాణించేటప్పుడు తమను తాము ఉత్సాహ పరుచుకోవడానికి చేసే డ్యాన్స్ ఇది. విశాఖలో జరుగుతున్న మిలన్ 2022 లో భాగంగా ఏర్పాటు చేసిన హార్న్ పైప్ డాన్స్ తో బాలికల బృందం వీక్షకులను అలరించింది. 



డ్రిల్ లాంటి డాన్స్


విశాఖలో జరిగిన మిలన్ సిటీ పెరేడ్ లో హైలైట్ అంటే సీ కేడెట్ కార్ప్స్ కు చెందిన బాలికల బృందం చేసిన హార్న్ పైప్ డాన్స్ అనే చెప్పాలి. నేవీకి సంబంధించిన మ్యూజిక్ కు ప్రత్యేకమైన స్టెప్స్ తో లయబద్దంగా చేసే డ్రిల్ లాంటి డాన్స్. సముద్రంలో ప్రయాణించేటప్పుడు అలల తాకిడికి ఊగిసలాడే ఓడలో పడిపోకుండా ఉండడానికి పట్టుకోసం చాలా దృఢంగా ఉండే బూట్లు ధరించి చేసే డాన్స్ ఇది. ఈ డ్రిల్ చేయడం అంత సులభమేమి కాదు. అయినప్పటికీ బాలికల బృందం అద్భుత ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన కోసం గత కొన్ని వారాలుగా బాలికలు కఠోర శిక్షణ పొందారు. 


1522లో తొలిసారిగా


ఈ హార్న్ పైప్ డాన్స్ గురించి తొలిసారి 1522వ సంవత్సరంలో పేర్కొన్నారు. బ్రిటన్(Britain), ఐర్లాండ్(Ireland) లకు చెందిన నావికా దళాలు కమర్షియల్ షిప్పుల్లోని నావికులు, పనివారు ఆటవిడుపుకు కోసం ఈ డాన్స్ చేసేవారు. సముద్రంలో రోజుల తరబడి ప్రయాణించే వారికి అప్పట్లో ఇదే ఎంటర్టైన్మెంట్(Entertainment) అంటారు. సైలర్స్ హార్న్ పైప్ డాన్స్ అనీ, లుక్ ఔట్ టు ది సీ అని ఈ డాన్స్ లో చాలా విభాగాలు ఉన్నాయి. అయినప్పటికీ వీటన్నింటికీ బేసిక్ స్టెప్స్ మాత్రం ఒకటే. కేవలం పురుషుల కోసమే అని భావించే ఈ డాన్స్ ఫార్మ్ ను తర్వాత కాలంలో మహిళలు కూడా ప్రదర్శించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వివిధ దేశాల నేవీలు ఈ డాన్స్ ను తమ ట్రైనింగ్ లో భాగంగా తమ నావికులకు ఇస్తున్నాయి. ప్రత్యేక సమయాల్లో దీనిని ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకే మిలన్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలోని సిటీ పెరేడ్ కు మొట్టమొదటి ఈవెంట్ గా ఈ హర్న్ పైప్ డాన్స్ ను ఏర్పాటుచేశారు. అయితే నావికులను మరపించేలా సీ కేడెట్ బాలికల బృందం ఈ డాన్స్ ను ప్రదర్శించి విశాఖ వాసుల అభిమానాన్ని పొందారు. 


Also Read: Milan-2022: కళ్లు చెదిరే విన్యాసాలు, విశాఖ చరిత్రలో గర్వించదగిన రోజు : సీఎం జగన్