Milan-2022: ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్–2022 కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్. జగన్ దంపతులు పాల్గొన్నారు. నేవల్ డాక్‌యార్డులోని ఐఎన్‌ఎస్ విశాఖను సీఎం జాతికి అంకితం ఇచ్చారు. ఆర్కే బీచ్‌లోని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్ –2022 వేడుకలను ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ మిలన్–2022కు వేదికగా నిలిచిన విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగిన రోజు. ఈ సాయంత్రం జరుగుతున్న ఉత్సవంలో 39 దేశాలు భాగస్వామ్యులయ్యాయి. భారతీయ నౌకాదళంలో తూర్పుతీర నౌకాదళ కేంద్రం ది సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం పాత్ర చిరస్మరణీయమైనది. విశాఖపట్నం పేరు మీద రూపొందించిన ఐఎన్‌ఎస్ విశాఖ యుద్ధనౌక భారతీయ యుద్ధనౌకల్లో కచ్చితంగా గర్వకారణంగా నిలుస్తుంది. ఇది భిన్నమైన సామర్ధ్యం కలిగిన యుద్ధనౌక. ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామి దేశీయంగా జలాంతర్గామిలను రూపొందించడంలో మన శక్తి సామర్ధ్యాలను నిరూపించింది.
ఐఎన్ఎస్ విశాఖపై డాల్ఫిన్ నోస్
భారత నౌకాదళం ఆధ్వర్యంలో 39 దేశాలతో కలిపి మిలన్ పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగర తీరం విడిది అయిందని సీఎం జగన్ అన్నారు. ఇది ఒక అరుదైన యుద్ధనౌకా విన్యాసాల పండుగ అని వ్యాఖ్యానించారు. ఈ పండుగకు దాదాపుగా 39 దేశాలను ఆహ్వానించారన్నారు. భారత నౌకాదళానికి, ప్రత్యేకించి ఈస్ట్రర్న్ నేవల్ కమాండ్‌కు అనేక దేశాల నుంచి వచ్చి, ఈ విన్యాసాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం అనే యుద్ధనౌకను కొద్ది కాలం క్రితమే నౌకాదళంలోకి తీసుకొచ్చారన్న సీఎం, ఈ నౌక పైభాగం మీద కూడా ప్రత్యేకించి విశాఖపట్నంలోని డాల్ఫిన్ లైట్‌హౌస్‌ను, ఇక్కడ సహజంగా, ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్‌నోస్‌ను, రాష్ట్ర మృగం కృష్ణజింకను ఐఎన్‌ఎస్ విశాఖ మీద చిత్రీకరించాలని గుర్తుచేశారు. అలాగే కొత్తగా నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామి విశాఖ తీరంలోకి రావడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఇలాంటి నౌకలతో జరిగే విన్యాసాలు విశాఖ ప్రజలతో ఎంతో ఉత్సాహంతో పాటు దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న సైన్యం మీద మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ విన్యాసాల ద్వారా సైనిక శక్తి మీద మరింత నమ్మకాన్ని పెంచగలుగుతామని సంపూర్ణంగా భావిస్తున్నామన్నారు.
మిలన్ విన్యాసాలకు తొలిసారి వేదిక
39 దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు, భారత నావికాదళం నుంచి పాల్గొన్న ఇతర ప్రతినిధులు, ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ , ఫైర్ సర్వీసెస్ , సీ కాడెట్ కాప్స్, నేవీ కాడెట్ కాప్స్, స్కూల్స్, మిత్ర దేశాలు, బ్యాండ్ ట్రూప్స్, కల్చరల్ ట్రూప్స్ కలిపి అధ్భుతంగా నిర్వహించిన పెరేడ్, విన్యాసాలు ఈ కార్యక్రమాన్ని మంచి జ్ఞాపకంగా మిగిల్చాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ నేవీ కలిసి సంయుక్తంగా ఈ తరహా కార్యక్రమానికి విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని సీఎం వైయస్.జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నావికాదళ ఉన్నతాధికారులతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.