PM Modi Meeting: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని దిల్లీ తిరిగి వచ్చిన ప్రధాని మోదీ(PM Modi) హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో పరిస్థితిని చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం సమావేశం కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యా దాడి(Russia Attack)తో ఉక్రెయిన్‌(Ukraine)లో దాదాపు 16,000 మంది భారతీయ పౌరులు చిక్కుకున్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ప్రధాని చివరిసారిగా గురువారం సాయంత్రం కేబినేట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీతో సమావేశమయ్యారు. భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. 






పుతిన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ  


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Putin)తో ప్రధాని మోదీ మాట్లాడారు. "హింసను తక్షణమే నిలిపివేయాలని" పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ నుంచి తన పౌరులు సురక్షితంగా తీసుకొచ్చేందుకు అత్యున్నత ప్రాధాన్యత  ఇస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడంలో రష్యా సహాయం కోరారు. అవసరమైన సూచనలు ఇస్తామని అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీతో అన్నారని సమాచారం. ఉక్రెయిన్‌ గగనతలం మూసివేయడంతో భారతీయుల తరలింపు నెమ్మదిగా సాగుతోంది. గత రెండు రోజులలో ఉక్రెయిన్‌తో సరిహద్దును పంచుకునే దేశాలైన హంగేరీ, పోలాండ్(Poland), స్లోవాక్ రిపబ్లిక్, రొమేనియా నుంచి విద్యార్థులను విమానాల్లో దేశానికి తరలిస్తున్నారు. గడ్డకట్టే చలిలో చాలా మైళ్ల దూరం ప్రయాణించి విద్యార్థులు ఆయా దేశాల సరిహద్దులను చేరుకున్నారు.


ఆపరేషన్ గంగా 


ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ "మన పౌరులను తిరిగి తీసుకురావడానికి ఇండియా ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టదు. ఆపరేషన్ గంగా అమలు చేయడం ద్వారా, వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నాం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దేశ పౌరులను తిరిగి తీసుకువస్తాం. వారి కోసం ప్రభుత్వం పగలు రాత్రి కృషి చేస్తోంది" అని ప్రధాని అన్నారు.


భూగర్భ మెట్రో స్టేషన్లలో ఆశ్రయం


నెలల తరబడి ఉద్రిక్తతల మధ్య రష్యా గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై సైనిక కార్యకలాపాలను ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో ఇంకా 16,000 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. రష్యా బాంబులు క్షిపణుల నుంచి తప్పించుకునేందుకు భూగర్భ మెట్రో స్టేషన్లు(Metro Station) బేస్మెంట్ల ఆశ్రయం పొందుతున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ సహాయం కోసం చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు.