Visakha News : విశాఖ ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయి ప్రియను బెంగళూరులో గుర్తించారు. సాయి ప్రియను బెంగళూరు నుంచి విశాఖకు తీసుకువచ్చారు పోలీసులు. సాయి ప్రియతో పాటు ప్రియుడు రవిని కూడా అదుపులోకి తీసుకున్నారు.  ప్రస్తుతం వారిద్దరూ విశాఖ ఎయిర్ పోర్ట్ లో పీఎస్ లో లొంగిపోయారు. మరికాసేపట్లో విశాఖ 3 టౌన్ పీఎస్ కు తరలించనున్నారు.  సాయి ప్రియ, తాను కలిసుంటామని ప్రియుడు రవి మీడియాతో చెప్పారు. మమ్మల్ని బతకనివ్వండి, తాను ఉద్యోగం చేసి పోషిస్తానని ప్రియుడు రవి తెలిపారు.  శ్రీనివాస్ తో పెళ్లి ఇష్టం లేదని చెప్పానని సాయి ప్రియ తెలిపింది. శ్రీనివాస్ పెళ్లి రోజు గిఫ్ట్ గా ఇచ్చిన బంగారు గాజులు ఆయనకే ఇచ్చేస్తానని చెప్పింది.  అనంతరం ఎయిర్ పోర్టు పీఎస్ లో సాయి ప్రియ సొమ్మసిల్లిపడిపోయింది. 


అసలేం జరిగింది? 


విశాఖ ఆర్కేబీచ్ లో అదృశ్యమైన సాయిప్రియను బెంగళూరులో గుర్తించారు పోలీసులు. అయితే మధ్యలో ఆమె నెల్లూరులో రెస్ట్ తీసుకోవడంతో కాసేపు ఆ జిల్లాలో కలకలం రేగింది. నెల్లూరు పోలీసులు కూడా హడావిడి పడ్డారు. అప్పటికే విశాఖ పోలీసులు ఆమె కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇటీవల భర్తతో కలిసి పెళ్లి రోజున విశాఖ ఆర్కే బీచ్ కు వచ్చిన సాయి ప్రియి కనిపించకుండా పోయింది. కంగారుపడిన ఆమె భర్త సముద్రంలో గల్లంతు అయిందేమోనని పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, నేవీ అధికారులు హెలికాప్టర్లతో గాలించారు. గజ ఈతగాళ్లతో సముద్ర తీరంలో వెదుకులాట కూడా అయిపోయింది. తీరా ఆరా తీస్తే ఆమె సముద్రంలో గల్లంతు కాలేదని, నెల్లూరులో ఉందనే సమాచారంతో నెల్లూరు జిల్లా పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా ఆమె గురించి సమాచారం తెలిసే లోపే సాయిప్రియ నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్లిపోయింది.  


నెల్లూరు టు బెంగళూరు 


నెల్లూరు జిల్లా కావలికి చెందిన రవి అనే వ్యక్తితో సాయిప్రియకు పరిచయం ఉంది. అతనితోపాటు  విశాఖ బీచ్ నుంచి నెల్లూరు వెళ్లిపోయింది. నేరుగా నెల్లూరు జిల్లా కావలికి వచ్చింది. కావలిలో ఆమె ఉన్నట్టు ఎవరికీ సమాచారం లేదు. రవి కుటుంబం కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. మీడియా ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసినా సాయిప్రియ ఎక్కడుంది, ఎవరి సంరక్షణలో ఉంది అనే విషయం మాత్రం కనిపెట్టలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు కూడా కాస్త టెన్షన్ పడ్డారు. సాయిప్రియను వెదుకులాడేందుకు టీమ్స్ రెడీ చేశారు.  నెల్లూరు జిల్లా పోలీసులు తమని పట్టుకుంటారేమోనన్న అనుమానంతో వెంటనే సాయిప్రియ, రవి ఇద్దరూ బెంగళూరు వెళ్లిపోయారు. విశాఖ నుంచి  కావలి వచ్చిన వారు, కావలి నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడ రవి, సాయిప్రియ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను కూడా ఆమె తల్లిదండ్రులకు వాట్సప్ చేశారు. వాట్సప్ లోనే ఆడియో సందేశాలు కూడా పంపించారు. తాను బతకాలని అనుకుంటున్నానని, తమకోసం వెతకొద్దని వేడుకుంది. ఇప్పటికే పరిగెత్తి అలసిపోయామని, ఇక ఎక్కడికీ వెళ్లలేమని తెలిపింది. 


విశాఖ తీసుకొచ్చిన పోలీసులు 


వైజాగ్ నుంచి వచ్చిన సాయిప్రియ బెంగళూరుని సేఫ్ ప్లేస్ గా ఎంచుకుంది. రవితో కలసి పారిపోయిన ఆమె, రాష్ట్రంలో ఉంటే ఏపీ పోలీసులు జల్లెడ పడతారని భావించి ముందుగానే బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపిస్తున్న సాయి ప్రియ, విశాఖ అధికారులను ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని అడిగింది. అధికారులను ఆమె కావాలని తప్పుదోవ పట్టించలేదు కానీ, అధికారులు మాత్రం ఆమెను వెదికే క్రమంలో ప్రజాధనం వృథా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సాయి ప్రియ, రవిని విశాఖ తీసుకొచ్చిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వేచిచూడాలి.