ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసరఫరాల శాఖ బుధవారం నుంచి గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖపట్టణంలో ప్రారంభించారు. లబ్దిదారులకు గోధుమ పిండి ప్యాకెట్ లను పంపిణీ చేశారు. ఒక్కో కార్డుపై రెండు కిలోల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని మంత్రి లబ్దిదారులకు అందించారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు భేష్ అని ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్ర పీడీఎస్ కార్యదర్శి మెచ్చుకుందని తెలిపారు. పేద వర్గాలకు మరింత మేలు చేయాలన్న లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళుతున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.
ఉత్తరాంధ్ర నుంచి తొలిసారిగా
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీపై గోధుమ పిండి అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40 గా ఉంది. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధార నందు రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు యం.డి.యు. వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని 6,94,755 కార్డు దారులకు ప్రస్తుతం గోధుమ పిండి పంపిణీ చేయనున్నామని, ఒక్క విశాఖపట్నం జిల్లాలో 4,54,485 కార్డుదారులకు పంపిణీ చేయనున్నామని, లబ్దిదారులు ఈ అవకాశం వినియోగించుకోవాలని మంత్రికారుమూరి నాగేశ్వరరావు కోరారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలో గల కార్డు దారులకు సబ్సిడీపై గోధుమపిండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్డుదారులు నాణ్యమైన గోధుమ పిండిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కారుమూరి తెలిాపారు.
గోధుమలు ద్వారా పౌష్టికాహారం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగింది. అందులో భాగంగా చాలా మంది రాత్రి సమయం ఆహారంలో పుల్కా, చపాతి వంటి ఐటమ్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. గోధుమల వినియోగం కూడా పెరుగుతుంది. వినియోగం పెరగటంతో ధరలు మార్కెట్ లో మరింత పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోధుమ పిండి పంపిణీని ప్రారంభించింది. గతంలో గోధుమలను నేరుగా పంపిణీ చేసేవారు. అయితే అనివార్య కారణాల వలన గోధుమల పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా గోధుమ పిండి పంపిణీని తలపెట్టింది. ప్రతి నియోజకవర్గంలో గోధుమ పిండిని ముందస్తుగా కేజీ 16 రూపాయలు చొప్పున, రెండు కిలోల వరకు పంపిణీ చేస్తారు. ఆ తరువాత స్పందనను బట్టి, అడిగినంత పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెడ్కాప్ అధ్యక్షుడు కె. కె.రాజు, స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ , జిల్లా పౌరసఫరాల అధికారి జి.సూర్యప్రకాశ్ రావు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఐ.రాజేశ్వరి, రేషన్ డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు చిట్టిరాజు పాల్గొన్నారు.