Ysrcp Congress Alliance : కాంగ్రెస్ పొత్తులపై స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ప్రజెంటేషన్ పై మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. స్ట్రాటజిస్ట్ లు వంద చెబుతారని, పొత్తులపై అంతిమ నిర్ణయం సీఎం జగన్ దే అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడానికి పునాది వేసింది వైఎస్ జగన్ అని మంత్రి అమర్ నాథ్ అన్నారు. 2004 నుంచి 2014 వరకూ దేశాన్ని శాసించిన సోనియా గాంధీకి ఎదురెళ్లి 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు సీట్లు కోసం వెతుక్కునేలా చేసింది సీఎం జగన్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ తో వైసీపీ ఎందుకు పెట్టుకుంటుందని ప్రశ్నించారు.
పొత్తులపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందన
కాంగ్రెస్ తో పొత్తు ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అది విధానపరమైన నిర్ణయం, ముఖ్యమంత్రి జగన్ నే దానిపై స్పందిస్తారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే తమ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే పార్టీకే మద్దతు ఉంటుందని విజయసాయి రెడ్డి అన్నారు. తనను అనుబంధ సంఘాల ఇంఛార్జ్ గా పరిమితం చేయడంపై విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రాంతీయ పార్టీలలో అధినేత ఆదేశాలను పాటించడమే శిరోధార్యం అన్నారు. ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన తనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక అవకాశాలు ఇచ్చారన్నారు. సాక్షిలో ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ లాంటి పదవులను సంతృప్తికరంగా నిర్వహించానన్నారు. అధినేత ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చడమే తన బాధ్యత అని విజయసాయి రెడ్డి తెలిపారు.
"పొత్తులు విధానపర నిర్ణయం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవారికి తమ మద్దతు ఉంటుందని సీఎం జగన్ గతంలో చెప్పారు. పార్టీలో నాకు ఎన్నో ముఖ్యమైన పదవులు ఇచ్చారు. సీఎం జగన్ వల్లే నేను ఇంత పైకి వచ్చాను. ఏ బాధ్యతలు ఇచ్చినా సక్రమంగా నిర్వహించాను. అంతే కానీ నాకు ఈ పదవి ఇవ్వండి అని నేనెప్పుడూ అడగలేదు. అడగను కూడా" అని విజయసాయి రెడ్డి అన్నారు.
ప్రశాంత్ కిశోర్ ప్రజెంటేషన్
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని.. కలసి పోటీ చేయాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌కు సూచించారు. కాంగ్రెస్ ఒప్పుకుంటుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా లేదా అన్నది పరిశీలించాలి. ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్న వేస్తే.. వంద శాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో చెబుతుంది. కాంగ్రెస్ పొత్తు తమకు గిట్టదని చెబుతుంది. తమ పార్టీ పేరులోనే కాంగ్రెస్ అని ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ నుంచి తాము ఓ విడిపోయామనే సంగతి కళ్ల ఎదురుగానే ఉన్నా.. తమకు బద్దశత్రువు కాంగ్రెస్ అనే చెబుతారు. అదే సమయంలో భారతీయ జనతాపార్టీతో అంత ఖరాఖండిగా తమ సంబంధాలను ఖండించలేరు. అలాగని.. ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటారా..లేకపోతే ఎన్డీఏలో చేరి కేంద్రమంత్రి పదవులు తీసుకుంటారా అంటే.. అలాంటి పనులు కూడా చేయలేదు. ఎందుకంటే అది రాజకీయంగా ఆత్మహత్యా సదృశం అవుతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్‌సీపీకి ఏకపక్షంగా మద్దతు పలికే ముస్లింలు, దళితవర్గాల వారు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగని బీజేపీని శత్రువుగా చూడలేని పరిస్థితి. ఇప్పటికిప్పుడు చూసుకుంటే కాంగ్రెస్‌తో పొత్తు అనే ఆలోచన వైఎస్ఆర్‌సీపీ చేసే అవకాశమే లేదు.