Monkeypox : విశాఖలో మంకీపాక్స్ కలకలం రేగింది. నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థికి మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. గతకొన్ని రోజులుగా విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె శరీరం, వేళ్లపై దద్దుర్లను వైద్యులు గుర్తించారు. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలుగా కనిపించడంతో వైద్యులు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని విశాఖ కలెక్టర్ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్య కళాశాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను పంపాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజుకు వైద్యాధికారులు లేఖ రాశారు. 


శాంపిల్స్ సేకరణ 


మెడిసిన్, డెర్మటాలజీ, ఎస్పీఎం, మైక్రోబయాలజీ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో ఇద్దరు టెక్నీషియన్లతో కూడిన టీమ్ ను శుక్రవారం వైద్య కళాశాలకు పంపించారు. మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థిని నుంచి వైద్యుల బృందం నమూనాలు సేకరించారు.  ఈ శాంపిల్స్ వైద్య పరీక్షల కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నారు. అయితే మంకీపాక్స్ అనుమానిత కేసుగా భావిస్తున్నామని, నిర్థారణ కోసం శాంపిల్స్ సేకరించినట్లు  వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల విద్యార్థినిని కలిసిన వారి వివరాలను వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. 


భద్రాద్రి కొత్తగూడెంలో


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం మంకీ పాక్స్‌ కలకలం రేగింది. మణుగూరు మండలంలోని విజయనగరం గ్రామానికి  చెందిన ఓ విద్యార్థిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.  మధ్యప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థి ఇటీవల సొంత ఊరుకు వచ్చారు. విద్యార్థిలో జ్వరం, ఇతర మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో అతడ్ని వైద్యాధికారుల సూచనలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ కు పంపించారు. 


పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ


ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయితే తాజాగా అమెరికా కూడా మంకీపాక్స్ ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అమెరికాలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుదలతో బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో అనూహ్య స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతోందని, కట్టడి చర్యలు బలోపేతం చేస్తున్నామని యూఎస్ వైద్యాధికారులు ప్రకటించారు. ఇప్పటికే దాదాపు 7 వేల మంది అమెరికన్లు మంకీపాక్స్ బారిన పడినట్టు అంచనా. ఇకపైనా కేసులు పెరిగే ప్రమాదముందని గుర్తించిన ఆరోగ్య విభాగం ఎమర్జెన్సీని అమల్లోకి తీసుకొచ్చింది.


Also Read : Monkey Pox Case in AP: ఏపీలో మంకీపాక్స్ కలకలం, 8 ఏళ్ల బాలుడిలో అనుమానిత కేసు!


Also Read : Monkey pox: మంకీపాక్స్ పై అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ.. మార్గదర్శకాలు జారీ!