Minister Gudivada Amarnath : మూడు రాజధానులపై మరోసారి ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులను కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలనేది సీఎం జగన్ ఆలోచన అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి వివాదాలు, వాస్తవాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రంలో 29 గ్రామాలు తప్ప చంద్రబాబుకు మిగిలిన జిల్లాలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని రాజధాని రైతులు అంటున్నారని, కానీ రాజధాని గ్రామాల వాసులు చేస్తుంది పాదయాత్ర కాదని దండ్రయాత్ర అని విమర్శించారు. విశాఖకు రాజధాని వద్దని అమరావతి వాసులు పాదయాత్ర చేయడం సరికాదన్నారు. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి అమర్ నాథ్ అన్నారు.
అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి చేసిందేమీ లేదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో పేదలకు చోటు లేదా? అని ప్రశ్నించారు. అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. 29 గ్రామాల కోసమే అమరావతి వాసులు ఉద్యమం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నారు. అమరావతి రైతుల పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశం ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం అందుకు చంద్రబాబే కారణమని మంత్రి అమర్ నాథ్ ఆరోపించారు. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతామన్నారు. బిల్లు పెట్టిన తర్వాత ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ప్రకటన ఉంటుందని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.
కొత్త బిల్లు పెట్టే ఆలోచన
మూడు రాజధానులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. మూడు రాజధానులపై స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు. రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని, అయితే కోవిడ్ కారణంగా ఇది కొంత ఆలస్యం అయిందన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంనుంచైనా విశాఖ నుంచి పాలన ఆరంభించవచ్చన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారన్నారు. మూడు రాజధానులను అడ్డుకునేందుకు చంద్రబాబు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్రకు ఉసిగొల్పారన్నారు.
వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
"వైసీపీ ప్రభుత్వం అమరావతి వద్దు అని చెప్పలేదు. అమరావతిని కూడా కలుపుకొని మూడురాజధానులు చేసి చూపిస్తామని, అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం అడుగుముందుకు వేస్తుంటే దాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ఒకటే రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందక పోవడమే కాకుండా, అక్కడ రాజధాని నిర్మాణానికి రూ.లక్షా 10 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం రాజధానికి ఖర్చు పెట్టే కన్నా ఆ మొత్తంతో అనేక పథకాలను ప్రవేశపెట్టడానికి అవకాశం కలిగింది. రాష్ట్రంలో రూ.15 వేల కోట్లతో నాడు నేడు వంటి బృహత్తర కార్యక్రమం, ఆసుపత్రుల అభివృద్ధి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం. విశాఖకు రాజధాని వద్దని చెప్పి, మొదటి సారి విశాఖ వచ్చిన చంద్రబాబును ఇక్కడి ప్రజలు ఎలా వెనక్కి పంపించారో అందరికీ తెలుసు. ఉత్తరాంధ్రవాసులు చాలా సౌమ్యులు. అలా అని పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తే చూస్తూ ఊరుకోం. "- మంత్రి గుడివాడ అమర్ నాథ్
డస్ట్ బిన్ నేతలు
సీపీఐ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ తులసి రెడ్డి వంటి డస్ట్ బిన్ నేతలను పక్కన పెట్టుకుని చంద్రబాబు ఇష్టారాజ్యంగా ప్రసంగాలు చేస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి గుడివాడ అమర్ నాథ్ హెచ్చరించారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే పాదయాత్రకు అనుమతులు నిరాకరించామన్నారు. ఒకప్పుడు అమరావతి దేవతల రాజధాని, చంద్రబాబు నిర్మించాలనుకున్నది దెయ్యాల, రాక్షసుల రాజధాని అని విమర్శించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మూడు రాజధానులు గురించి చేసిన వ్యాఖ్యలపై అమర్ నాథ్ స్పందిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాతే ఈ విషయం గురించి మాట్లాడాలని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నామని మంత్రి చెప్పారు.
Also Read : Amaravati Padayatra : అమరావతి రైతులకు రిలీఫ్ - పాదయాత్రకు హైకోర్టు అనుమతి !