Minister Amarnath : టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. బాలయ్య బాబు కాదు బాలయ్య తాత అంటూ ఎద్దేవా చేశారు. బాలయ్యకు 60 దాటాయని, బాలయ్య తాతను చూడడానికి ఎవరు వస్తారని విమర్శించారు. బాలయ్య ఫంక్షన్ కు అనుకున్నంత జనం రాలేదన్నారు. బాలయ్య ఇంకా సమరసింహరెడ్డి కాదని, ఇప్పుడు వీర సింహారెడ్డి అన్నారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య బాబులు రోడ్లపై మీటింగ్ లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాయగూరలు కొనడానికి, పల్లీలు కొనడానికి వచ్చిన వాళ్లతో మీటింగ్ లు పెట్టి జనాన్ని చంపాలని చూస్తున్నారని విమర్శించారు.
కొణతాల టీడీపీ ముసుగు వేసుకున్న నేత
ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట కోల్డ్ స్టోరేజ్ డార్క్ రూంలో లీడర్స్ సమావేశం పెట్టారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మూడు దశాబ్దాల పాటు పదవులు పొందిన వారే ఈ వేదికపై ఉన్నారన్నారు. వీరిలో కొందరికి ఉత్తరాంధ్రతో సంబంధం కూడా లేదన్నారు. ఎక్కువ మంది చంద్రబాబుతో కలిసి ఎన్నికల్లో ప్రయాణం చేసే వారే ఉన్నారని ఆక్షేపించారు. కేవలం రాజకీయ విమర్శలు చేయడానికే ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఏర్పాటుచేశారన్నారు. అసలు ఉత్తరాంధ్ర కేంద్రంగా పరిపాలన రాజధాని అంశాన్ని చర్చిస్తారని అనుకున్నామని, కానీ అసలు చర్చించలేదన్నారు. సీపీఐని రామకృష్ణ చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారని ఎద్దేవా చేశారు. కొణతాల రామకృష్ణ తటస్థులు కాదు ముసుగు వేసుకున్న టీడీపీ నాయకుడు అన్నారు. అయ్యన్న పాత్రుడు వయసు మీద పడిన దశలో అరగంట మాట్లాడి కంట నీరు వస్తే భావోద్వేగానికి గురైనట్టు కొన్ని టీవీలు చూపించాయన్నారు. ప్రైవేట్ భూములు దోచారనీ అవాస్తవపు ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ ప్రభుత్వ భూములు దోచుకున్నది ఎవరో జనానికి తెలుసన్నారు.
జీవో నెం 1 లో రోడ్ షో లు చేయవద్దని లేదు
"గీతం యూనివర్సిటీ ఎవరిది? ప్రభుత్వం భూములు దోచుకున్నది టీడీపీ నేతలే. ఎంతో కాలం మంత్రిగా పని చేసిన అయ్యన్న ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలి. ఐటీ సెజ్, మెడికల్ కాలేజీలు ఎప్పుడైనా ఏర్పాటు చేశారా?. బాక్సైట్ కోసం జీవో ఇచ్చింది ఎవరు? టీడీపీ ఇచ్చిన తవ్వకాల జీవో రద్దు చేయాలని చింతపల్లిలో ప్రతిపక్ష నాయకునిగా జగన్ మోహన్ రెడ్డి సభకు హాజరయ్యారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు కేంద్రం ఇస్తే ఆ డబ్బు అమరావతిలో పెట్టారు. ఆపై కేంద్రం యుటిలిటీ సర్టిఫికేట్ అడిగితే సమాధానం లేదు. వెనుకబడిన జిల్లాల నిధులు అమరావతిలో ప్రింటర్లు, స్కానర్లు కొన్నారు. విశాఖలో జరుగుతున్న, జరగ బోయే సదస్సులు ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా? కొణతాల టీడీపీ, తోక పార్టీలను సమర్థిస్తున్నారు. చంద్రబాబుని ఎలా లేపాలనన్న తపన తప్ప ఉత్తరాంధ్ర చర్చ వేదికలో మరో అంశం లేదు. జీవో 1 లో ఎక్కడా రోడ్ షో చేయవద్దని లేదు. బహిరంగ సభలు విశాల ప్రదేశాల్లో పెట్టాలని జీవోలో ఉంది.నిన్న బాలకృష్ణ బహిరంగ సభ జరుపుకో లేదా?" - మంత్రి అమర్నాథ్