MP GVL Narsimharao : ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చురకలు అంటించారు. ఐటీ గురించి మంత్రి అవగాహన పెంచుకోవడానికి ఓరియంటేషన్ తీసుకుంటే మంచిదని సూచించారు. కీలకమైన శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ ఆ శాఖపై అవగాహన లేకపోతే పెట్టుబడులను ఏవిధంగా ఆహ్వానిస్తారని ఎద్దేవా చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నారని ఎంపీ జీవీఎల్ తెలిపారు. ఐటీ ఉద్యోగులు విశాఖలో పనిచేసే విధంగా ఐటీ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. టీడీపీ, వైసీపీ స్వలాభం ఏపీలో రాజకీయాలు చేస్తున్నాయని జీవీఎల్ ఆరోపించారు. సీఎం జగన్, చంద్రబాబుకు హైదరాబాద్ పై ఉన్న ప్రేమ ఏపీ అభివృద్ధిపై లేదన్నారు. వీరిద్దరు నేతలు హైదరాబాద్ వదిలి ఏపీలో శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకున్నప్పుడే ఇక్కడి ప్రజలకు విశ్వాసం కలుగుతుందన్నారు జీవీఎల్. 


ఐటీ ఎగుమతుల్లో అట్టడుగున ఏపీ 


వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్రప్రదేశ్ పనితీరు అధ్వాన్నంగా ఉందని ఇటీవల ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు విమర్శించారు. భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ. 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం రూ.1290 కోట్లు మాత్రమే ఉండడమే అందుకు నిదర్శనం అన్నారు. 2021-22లో భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ఏ మేరకు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు  ఇటీవల పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం తెలిపారు. ఇందులో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగాల నుంచి ఎగుమతులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) కింద నమోదైన యూనిట్లు రూ.6.29 లక్షల కోట్లు కాగా, సెజ్ కింద నమోదైన యూనిట్లు రూ.5.3 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  పేర్కొన్నారు. అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలు కర్ణాటక (3.96 లక్షల కోట్లు), మహారాష్ట్ర (రూ.2.37 లక్షల కోట్లు), తెలంగాణ (1.81 లక్షల కోట్లు) అని వివరించారు. దీనితో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు కేవలం రూ. 1256 కోట్లు, ఇది భారతదేశ ఎగుమతుల విలువలో కేవలం 0.1% శాతం మాత్రమేనని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు సాంకేతిక సంస్థలతో విశాఖపట్నం నగరం రూ.776 కోట్ల మేర ఐటీ/ఐటీల ఎగుమతులకు మాత్రమే దోహద పడిందన్నారు. 


ఐటీ రంగంపై అలసత్వం 


ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు సాఫ్ట్ వేర్ రంగాన్ని శాసిస్తున్నారన్నది వాస్తవమని జీవీఎల్ అన్నారు. అందునా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లినటువంటి సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల్లో పని చేసి ఐటీ రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇటీవల పార్లమెంట్ లో ఓ ప్రశ్న అడిగానని అందుకు వచ్చిన సమాధానం చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్ వేర్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ రంగాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. ఐటీ రంగంలో విశిష్ట స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఏపీ యువతకు ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ఎవరిని అడిగినా హైదరాబాద్ లో, బెంగళూరులో పని చేస్తున్నామని చెబుతున్నారే తప్ప విజయవాడలో, విశాఖలో చేస్తున్నామని మాత్రం ఏ ఒక్కరూ చెప్పడం లేదన్నారు. అందుకు కారణం వైసీపీ ప్రభుత్వ అలసత్వమే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని జీవీఎల్ హితవు పలికారు.