MP GVL Narasimha Rao : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదన్న కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటనను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కొన్ని సంవత్సరాలుగా తమ అవిశ్రాంత కృషి, శక్తివంచన లేని ప్రయత్నం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అన్ని విధాలా బలోపేతం చేయడంపై, RINLకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించడంపై ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టి సారించాలని, ఆ దిశగా అవసరమైన అన్ని రకాల చర్యలను ఆలస్యంగా లేకుండా ముందుకు తీసుకువెళ్లాలని అనేకసార్లు ఉక్కు మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపామని ఎంపీ జీవీఎల్ చెప్పారు.
కేంద్రం సానుకూల నిర్ణయం
ఎంపీ జీవీఎల్ తాను ఉక్కుశాఖ మంత్రితో పలుమార్లు చేసిన చర్చల వివరాలను, పార్లమెంటులో RINL పై లేవనెత్తిన ప్రశ్నలు, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు రాసిన లేఖల వివరాలను మరోసారి మీడియాకు విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై అనేక ఉద్యోగ సంఘాలు, వివిధ పార్టీలు అనేక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుందని ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జీవీఎల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అనేక పార్టీలు, ఉద్యోగ సంఘాలు చేసిన ప్రకటనల వల్ల ప్రజల్లో అనేకమైన అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఉక్కుశాఖ సహాయ మంత్రి నేడు విశాఖపట్నంలో పర్యటించి RINL ఉద్యోగులకు ఉపశమనాన్ని కలిగించారన్నారు.
కేసీఆర్, కేటీఆర్ డబ్బా కొట్టుకుంటున్నారు
"విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉద్దరిస్తామని ఆంధ్రా ద్రోహి కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారు. ఏపీకి కేసీఆర్ చేసిన ద్రోహం ఇక్కడి ప్రజలు మర్చిపోలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్.. ఏపీకి రావాల్సిన వాటిని అడ్డుకుంటున్నారు. ఇప్పుడేమో స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదో ఆపద్బాంధవుడు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈవోఐ అంటే మాకు మూలధనం ఎవరైతే ఇస్తారో వాళ్లకు స్టీల్ సప్లై చేస్తామని స్టీల్ ప్లాంట్ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై నేను అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిసి సమస్యలు తెలియజేశాను. లేఖలు కూడా రాశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్ఐఎన్ఎల్ ను ఆదుకోవాలని కోరాను. టీడీపీ , వైసీపీ పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోయినా మేమే మాట్లాడాం. మా వంతు ప్రయత్నాలు చేసి స్టీల్ ప్లాంట్ ను పునరుద్ధరించేందుకు కృషి చేశాం. కేసీఆర్ లాగా డబ్బా కొట్టుకోడానికి మేం పనిచేయడంలేదు. కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిసి స్టీల్ ప్లాంట్ ను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తే.. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ సిగ్గులేకుండా డబ్బా కొట్టుకుంటున్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలేదు. ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగామార్చేశారు. కేసీఆర్ కొత్త డ్రామాను ఏపీ ప్రజలు నమ్మరన్నారు " - ఎంపీ జీవీఎల్ నరసింహారావు