Visakha Railway Zone As South Coatal Railway Zone : రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. సాగర నగరం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ (South Coatal Railway Zone), వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ప్రత్యేక జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో పేర్కొన్న సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో గతంలో కమిటీ వేశారు.


రాజ్యసభలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం.. 
రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇలా బదులిచ్చారు. ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ (విశాఖ రైల్వే జోన్)కు డీపీఆర్‌ సమర్పించాక కొత్త రైల్వేజోన్‌, రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ అంశాలను పరిశీలించడానికి సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటు చేశాం. కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు’ వివరించారు. ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. మొదటగా ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టి, క్రమంగా అవసరమయ్యే నూతన భవనాల్ని నిర్మించుకోవాలని డీపీఆర్‌లో సూచించారు. ఈ దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పడాలంటే రాయగడ డివిజన్‌ కూడా ఏర్పాటు కావాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో దానిపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Petrol Price Today: వాహనదారులకు షాక్ - పలు నగరాల్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు 


విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ (South Coatal Railway Zone)
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టాలని విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే ఓఎస్డీకి కేంద్రం నిర్దేశించింది. విశాఖ జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి భూమిని ఎంపిక చేశామని, ప్రక్రియను వేగవంతం చేయడానికి భూమి సర్వే చేపట్టాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైల్వే ఆఫీసు లేఅవుట్‌, నివాస సముదాయాలు, ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ నిర్దేశించింది. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌, ఇప్పుడున్న వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రం (ఛత్తీస్ గఢ్)గా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.


కొవిడ్19 కారణంగా జాప్యం..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రైల్వే జోన్ పనులతో పాటు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 16,878 నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు, 34 గెజిటెడ్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3 లక్షల 1 వెయ్యి 4 వందల 14 (3,01,414) నాన్‌గెజిటెడ్‌ పోస్టులు, గెజిటెడ్‌ ఉద్యోగాలు 2,519 ఖాళీగా ఉన్నట్లు రైల్వేమంత్రి వెల్లడించారు.


Also Read: Weather Updates: భగభగ మండుతున్న సూరీడు - ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల ప్రజలు బీ కేర్‌ఫుల్ !