Holi Different Ritual in Kurnool District: హోలీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగులు చల్లుకోవడం, కాముని దహనం. పండుగ సందర్భంగా చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆద్యంతం సంబరాల్లో మునిగి తేలుతారు. రంగుల నీళ్లు చల్లకుంటూ డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తారు. అయితే, ఆ గ్రామంలో యువకులు మాత్రం హోలీ రోజున వింత ఆచారం పాటిస్తారు. చీరలు కట్టుకుని ఆభరణాలు, పువ్వులతో సింగారించుకుని.. ఆడవారి వేషధారణలో మారిపోతారు. వారు ఎందుకలా చేస్తారో తెలియాలంటే ఇది చదవాల్సిందే.


కర్నూలు (Kurnool) జిల్లా ఆదోని (Adoni) మండలం సంతకుళ్లారు గ్రామం. ఈ గ్రామస్థులు హోలీ రోజున అనాదిగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. అదేంటంటే.. హోలీ రోజున పురుషులు మహిళల వేషధారణలోకి మారతారు. చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని.. ఆభరణాలు సింగారించుకుంటారు. ఆ స్త్రీ వేషధారణతో రతీ మన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని వారి నమ్మకం. పెళ్లి కాని అబ్బాయిలు వివాహం కోసం, నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం కోసం, అనారోగ్య సమస్యలు, కోరిన కోర్కెలు తీరాలంటే ఇలా హోలీ రోజున ఆలయంలో పూజిస్తే అవి నెరవేరుతాయని వారు విశ్వసిస్తారు. తరాతరాల నుంచి తాము ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.


మరో ఆచారం


ఇదే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తమ ఇలవేల్పు సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడులో జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే అనారోగ్య సమస్యలు, వివాహం, సంతానం సమస్యలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అదే నమ్మకంతో భక్తులు వారి దవడలు, వీపునకు పొడవాటి ఇనుప కడ్డీలు గుచ్చుకుని భక్తిని చాటుకుంటారు. ఇలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని.. ఇది తమ పెద్దల నుంచి వస్తోన్న ఆనవాయితీ అని పేర్కొంటున్నారు.




Also Read: Chandrababu: 'అధికారంలోకి వస్తే ఇంటికే రూ.4 వేల పింఛన్' - మా 3 పార్టీల అజెండా ఒక్కటేనన్న చంద్రబాబు