గన్నవరం పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య చెక్ పవర్ పై ఆంక్షలు విధిస్తూ జిల్లా పంచాయితీ అధికారి ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్ చెక్ పవర్ ఎందుకు రద్దు చేయకూడదో పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చారు. పంచాయతీ సర్పంచ్ సౌజన్య, కార్యదర్శి రాజేంద్రప్రసాద్ కలసి పంచాయతీ నిధులు 1,58,12,672 రూపాయలు దుర్వినియోగం చేశారని అధికారులు నిర్దారించారు.
గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సౌజన్యపై వచ్చిన అవినీతి ఆరోపణలపై గుడివాడ డివిజనల్ పంచాయతీ అధికారి విచారించారు. నివేదికను సీల్డ్ కవర్‌లో జిల్లా పంచాయితీ అధికారికి సమర్పించారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు వెల్లడి కావడంతో గ్రామ పంచాయతీ నిధులు డ్రా చేసుకునే అధికారంపై ఆంక్షలు పెట్టారు. ఆ అధికారాలు ఎందుకు తొలగించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
గన్నవరం గ్రామ పంచాయతీలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు గన్నవరానికి చెందిన ముప్పనేని రవి కుమార్, బెజవాడ నాగరాజు, యల్.వి.ప్రసాద్, ఇతర వార్డు మెంబర్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగం పై పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా వార్డు మెంబర్లు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాలని జిల్లా పంచాయితీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. దీంతో డిపిఓ నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు గుడివాడ డీఎల్పీఓ పంచాయతీకి వచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి రికార్డులు తీసుకువెళ్లారు.
గ్రామ పంచాయతీలో చేపట్టే పనులు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి అనేక అక్రమాలు జరుతున్నాయని, సర్పంచ్, కార్యదర్శులు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడివాడ డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ నిర్వహించారు. విచారణలో గన్నవరం గ్రామ పంచాయతీ నిధులు సాధారణ నిధులు రూ .1,53,85,010లు , 14 వ ఆర్ధిక సంఘ నిధులు రూ . 95,155లు, 15 వ ఆర్ధిక సంఘ నిధులు రూ .3,32,507 ఇలా మొత్తం రూ .1,58,12,672 దుర్వినియోగం అయినట్లు ప్రాథమిక నివేదిక సమర్పించారు.
నివేదిక అంతిన తర్వాత అవినీతి ఆరోపణలపై చర్యలను అధికారులు చర్యలు వేగవంతం చేశారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా ఏ విధమైన సంజాయిషీ రాకపోతే, జి.ఓ.యం.యస్.నెం .30 ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహరం తీవ్ర చర్చనీయాశంగా మారింది.
వర్గ పోరే కారణమా...
గన్నవరంలో అధికార పక్షంలోనే వర్గపోరు తారా స్థాయిలో ఉంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గర అయిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై స్దానిక వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్దానిక పంచాయితీ అధికారులను బలి చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎమ్మెల్యే అనుచర గణం ఉందని అధికార పార్టీకి చెందిన నేతలే ఆరోపణలు చేస్తున్నారు.