Andhra Pradesh News | అమరావతి: వైఎస్సార్ సీపీ (YSRCP) ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి అరెస్టును ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు అని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని, వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. 

రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఏపీలో లేని లిక్కర్‌ స్కామ్‌ (AP Liquor Scam)ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు. ఆ ప్రక్రియలో అంతులేని  వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి సర్కార్ ఇలాంటి చర్యలు ఇంకా కొనసాగిస్తే ఏ మాత్రం సహించం. ఏపీ ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం - రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి

అక్రమ కేసులు పెట్టి అరెస్టులు.. ఆర్కే రోజాఏడాది పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు అని ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించారు. చంద్రబాబు పాపం పండే రోజు కూడా వస్తుందంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

అధికారం శాశ్వతం కాదు.. విడదల రజనీరాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచకపాలన అని ఏపీ మాజీ మంత్రి విడదల రజనీ అన్నారు. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి, వైఎస్సార్ సీపీ నేతలపై  అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy)ది అక్రమ అరెస్ట్ అని విడదల రజనీ తీవ్రంగా ఖండించారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు.

సంబంధం లేని వారిపై కూటమి సర్కార్ అక్రమ కేసులులేని మద్యం కేసును సృష్టించి, వైసీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఏమాత్రం సంబంధం లేని వారందరినీ అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు, కూటమి నేతలు ప్రజల్ని మోసం చేసిన తీరుని వైఎస్సార్ సీపీ ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తుండటాన్ని ఓర్వలేక లేని కేసులను సృష్టించి మా నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు. - విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు కేకే రాజు