విజయవాడ శివారు గన్నవరానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నేత, కృష్ణా డిస్ట్రిక్ కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. యువగళం పాదయాత్రలో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెంకట్రావుకు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. 


2019 అసెంబ్లీ ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేశారు. అప్పటి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై 838 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాతి కాలంలో వల్లభనేని వంశీ వైఎస్ఆర్ సీపీలోకి రావడంతో అధిష్ఠానం నుంచి వెంకట్రావుకు ప్రాధాన్యం తగ్గింది. డీసీసీబీ పదవి ఇచ్చి కొన్నాళ్లకే ప్రభుత్వం తొలగించారు. 


లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా ఆగస్టు 22న గన్నవరంలో బహిరంగ నిర్వహిస్తున్నారు. దాదాపు 2 లక్షల ప్రజలతో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో యార్లగడ్డ వెంకట్రావు చేరడం కార్యకర్తల్లో మరింత ఊపు తేనుంది. 






నిన్న చంద్రబాబును కలిసిన వెంకట్రావు


ఆదివారం (ఆగస్టు 20) టీడీపీ అధినేత చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. టీడీపీలో చేరడానికి తాను ఇష్టంగానే ఉన్నానని, త్వరలోనే చేరతానని చంద్రబాబుకు చెప్పినట్లుగా యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ప్రకటించారు. భేటీ తర్వాత ఆయన హైదరాబాద్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కూడా కలిసి పని చేద్దామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారని అన్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ప్రజా ప్రతినిధిగా ఉండాలని భావించి గతంలో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయానని గుర్తు చేశారు.


కానీ, తన ప్రత్యర్థి అయిన వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్ సీపీకి మద్దతు పలికారని, దాంతో వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం తనను పూర్తిగా పక్కకు పెట్టేసిందని ఆవేదన చెందారు. గత మూడున్నర సంవత్సరాల నుంచి అధిష్ఠానం తనను, తన అనుచరులను పట్టించుకోవడం మానేసిందని వివరించారు. 


గన్నవరం నుంచి పోటీ చేస్తారా అనే విషయం విలేకరులు ప్రశ్నించగా, చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా తాను సిద్ధమే అని అన్నారు. గన్నవరం, విజయవాడ లేదా గుడివాడ నుంచి కూడా పోటీ చేయడానికి తాను రెడీ అని అన్నారు. 


నేడు గన్నవరంలో లోకేశ్ పాదయాత్ర


నేడు గన్నవరం నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర సాగింది. నిడమానూరు క్యాంప్​ సైట్​లో బీసీలు, చేతివృత్తిదారులతో లోకేశ్​ ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖిలో వారితో మాటామంతీ నిర్వహించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ద్వారా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు. గూడవల్లి సెంటర్‌లో రజక సామాజిక వర్గ ప్రజలతో లోకేశ్​ సమావేశం అయ్యారు. వారికి కీలక హామీలు కూడా ఇచ్చారు. గన్నవరంలోని గాంధీ విగ్రహం సెంటర్​లో లాయర్లతో లోకేశ్ బేటీ కానున్నారు.