వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థకు భారీ ఊరట లభించింది. మధ్యంతర ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి దాడులు చేయొద్దని ఏపీహైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న దాడులపై ఏపీ హైకోర్టును మార్గదర్శి యాజమాన్యం ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు దాడులు చేయొద్దని ఆదేశించింది. రెండు రోజుల్లో ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. అంటే ఈ ఊరట రెండు రోజుల పాటే లభించినట్టు. 


గత కొన్ని రోజులుగా మార్గదర్శి, ప్రభుత్వం  మధ్య వార్ నడుస్తోంది. మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని ఏపీసీఐడీ సహా పలు విభాగాల అధికారులు సోదాలు చేస్తున్నారు. రాత్రీ పగలు అక్కడే ఉండి తనిఖీలు చేస్తున్నారు. గతంలో జరిగిన దాడులు, చేసిన ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన మార్గదర్శి ఉపశమనం పొందింది. ఇప్పుడు మరో రూపంలో దాడులు చేస్తున్న ప్రభుత్వం తీరుపై మళ్లీ కోర్టును ఆశ్రయించిందా సంస్థ. 


జరుగుతున్న దాడులు, మార్గదర్శి చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఆదివారం సిఐడీ అధికారులు ప్రెస్‌మీట్‌ పెట్టారు. కొన్ని రోజుల నుంచి చేస్తున్న తనిఖీల్లో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వచ్చాయంటూ చెప్పారు. సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ... చిట్టీ వేస్తున్న వారికి తెలియకుండానే వేలంపాటల్లో పాల్గొని సంతకాలు కూడా చేస్తున్నారని తెలిపారు. బాధితులతో ఫిర్యాదులు ఇప్పించి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మూడు కేసులు రిజిస్టర్ చేసినట్టు వెల్లడించారు. రహస్య చందాదారులు కూడా ఉన్నారని వారి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే 9493174065 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 



మరోవైపు ట్విటర్‌లో #TeluguPeopleWithRamojiRaoఅనే ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్యాంపెయిన్‌ను రామోజీరావు అభిమానులు, టీడీపీ సానుభూతిపరులు నడుపుతున్నారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర నాయకులు రామోజీరావుకు మద్దతు తెలిపుతూ ట్వీట్‌లు చేశారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. 


టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై వైఎస్‌ఆర్‌సీపీ కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయింది. చందదారులకు జరిగిన అన్యాయంపై ఎవరు పోరాటం చేస్తారని ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రశ్నిస్తోంది.