YSRCP News | తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నాలుగు గడిచినా ఇప్పటికీ సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవన్ లేదని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అబద్ధపు హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కోపం పెరిగిపోతోందని, అందుకే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తున్నాం అన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో వైయస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో జగన్ సమావేశయ్యారు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం కుప్పకూలిందని, 3 నెలల్లో లక్షన్నర ఫించన్లు తగ్గించారని జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయని, స్కూళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆస్పత్రులు ఏవీ సరిగా లేవన్నారు. జన్మభూమి కమిటీలు వచ్చాయి. వ్యవసాయానికి పెట్టుబడి సాయం, ఆర్బీకేలు, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పోవడంతో చదువులు, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా తిరోగమనంలో ఉందన్నారు.
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
‘ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారు. డోర్ డెలివరీ ఆపేశారు. విజయవాడలో వరద నష్టాన్ని కూడా అంచనా వేయలేకపోయారు. మరోవైపు ప్రజలు కలెక్టర్ ఆఫీస్‌ను చుట్టుముడుతున్నారు. అందుకే 4 నెలలకే ఏపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెరగడంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకసారి తిరుపతి లడ్డూ అని వివాదం, డిక్లరేషన్ పేరుతో మరోసారి ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారు. వీళ్లు చేసే పనులతో దేవుడికి కోపం వచ్చి, మొట్టికాయలు వేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలోనే అపాయింట్ అయిన ఐఏఎస్ ఆఫీసరే టీటీడీకి ఈఓగా ఉన్నారు. చంద్రబాబు మాటలు, ఈవో చెప్పిన మాటలు వేర్వేరుగా ఉన్నాయి. చంద్రబాబు చెప్పింది అబద్దాలు అని తేలిపోయింది. నోటీసులు ఇవ్వలేదు.. అడ్డుకోలేదంటారు. నోటీసులు చూపిస్తే మౌనంగా ఉంటారు. వైసీపీకి చెందిన దాదాపు 24 అనుబంధ విభాగాలను యాక్టివేట్ చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పాత్ర చాలా కీలకం. ఇవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పోరాడుతుంది. మనం మరింత ఆర్గనైజ్డ్‌గా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఉన్న పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఆర్గనైజ్డ్‌గా అనుబంధ విభాగాల్లోకి తీసుకుని వస్తే.. ఏదైనా సాధించగలుగుతాం. కేడర్ అగ్రెసివ్ గా ఉంటే ప్రజలకు అండగా నిలబడగలుగుతాం’ అన్నారు జగన్.
పార్టీ పిలుపు ఇస్తే గ్రామస్ధాయి వరకు మెసేజ్ పోవాలని, అలాంటి వ్యవస్ధను క్రియేట్ చేయాలన్నారు. జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిస్తే ఆ జిల్లా అంతా కదలాలని, గ్రామ స్ధాయి నుంచి కదలిక రావాలన్నారు. జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు సమ్వయంతో పని చేయాలి.. ఇందులో గ్రామస్దాయికి పార్టీని ఎలా తీసుకుని పోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తామన్నారు.
Also Read: AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
జగన్ మీ ప్రతినిధి మాత్రమే..
జగన్ మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు, జిల్లా అధ్యక్షులు సహా పార్టీలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో, వారికే ప్రాధాన్యత కల్పిస్తాం. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి వైసీపీ పూర్తిగా అండగా ఉంటుంది. వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల ప్రక్రియ 3, 4 నెలల్లో పూర్తి కావాలి. తర్వాత బూత్ కమిటీల ఏర్పాటు. పార్టీ నిర్మాణంలో ఉన్న వారందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని, ఈ ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా వైసీపీని నిర్మిద్దాం. పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం చేసుకోవాన్న దానిపై వర్క్ షాప్ నిర్వహిస్తామని నేతలతో సమావేశంలో జగన్ చెప్పారు.