Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు మూడు గుడ్ న్యూస్‌లు చెప్పారు. ఇవాళ్టి నుంచి చెత్త పన్ను వసూలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. అంతే కాకుండా డ్వాక్రా సంఘాలను ఇకపై చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా గ్రూప్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. 


మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అక్కడకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీజీ ఆశయాలు మేరకు వచ్చిదే స్వచ్ఛ భారత్ నినాదమన్నారు చంద్రబాబు. అందుకే దీన్ని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారని గుర్తు చేశారు. దీని అమలు కోసం ప్రత్యేకంగా ఉపసంఘం ఏర్పాటు చేశారని దానికి తాను అధ్యక్షత వహించాని తెలిపారు. అంతే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే విషయంలో కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నట్టు వెల్లడించారు చంద్రబాబు. 


మన ఊరును, జిల్లాను, రాష్ట్రాన్ని క్లీన్‌గా ఉంచేందుకు కృషి చేస్తున్న వారిని అభినందించాలన్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతు సంఘాలు, డ్వాక్రా సంఘాలు చూశామని ఇకపై స్వచ్ఛ సేవకుల కోసం సంఘాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సంక్రాంతి నుంచి వీటికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఫ్లెక్సీల నిషేధం విషయాన్ని పునఃపరిశీలిస్తామన్నారు చంద్రబాబు. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకొని ఫ్లెక్లీలు లేని రాష్ట్రంగా మార్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 


రాష్ట్రాన్ని పీ4 విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు చంద్రబాబు. అందుకే పేదరికం లేని సమాజం కోసం ప్లాన్లు చేస్తున్నామన్నారు. అందుకే డ్వాక్రా సంఘాలను ఇక ఎంఎస్‌ఎంఈ హాదా కల్పిస్తామన్నారు. ఈ ప్రక్రియను సంక్రాంతి నుంచి  చేపడతామన్నారు.  


Also Read: తిరుమలలో పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమార్తె ఫొటోస్ వైరల్.. చిన్నప్పడు కూడా ఎంత బావుందో!