Bandar Port works will complete by 2025 says AP CM Chandrababu | మచిలీపట్నం: బందర్ పోర్టు పనులను 2025 నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో బందర్ పోర్టు పనులు 24 శాతం మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. రూ.3,669 కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు బందర్ పోర్ట్ అని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం మచిలీపట్నంలో బందరుపోర్టు పనులను స్వయంగా పరిశీలించారు. పురోగతిపై పోర్టు అధికారులను సీఎం చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


రాజధాని అమరావతికి దగ్గరగా పోర్ట్
అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోర్టు నిర్మాణానికి అవసరమున్న మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామని చెప్పారు. బందర్ పోర్టు పనులు పూర్తైతే మొదట 4 బెర్త్ లు ఏర్పాటు అవుతాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్త్ ల దాకా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. పోర్టు పూర్తైతే మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. రాజధాని అమరావతికి కూడా బందరు పోర్టు దగ్గరగా ఉంటుందన్నారు చంద్రబాబు. త్వరలోనే అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (Police Training Center) స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. కంటైనర్ పోర్టు కింద ఇంటిగ్రేడ్ చేస్తే తెలంగాణ (Telangana)తో పాటు పలు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 






వైసీపీ కార్యాలయంపై చట్ట ప్రకారం చర్యలు


బందరు పోర్టు ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యమాలు నడిచాయని చంద్రబాబు గుర్తు చేశారు. పోర్ట్ ప్రాధాన్యతను గుర్తించి గతంలో తాము బందరు పోర్టు పనుల ప్రారంభించగా.. గత వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల నిర్లక్ష్యం జరిగిందన్నారు. వారి తరహాలో తాము కూడా విధానాలు మార్చితే విధ్వంసం చేసినట్లు అవుతుందన్న కారణంగా.. పనులనే యథాతథంగా కొనసాగించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తీసుకొస్తామని, బీపీసీఎల్ (BPCL) ఏర్పాటుపైనా త్వరలో క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. పోలీస్ భూమిలో నిర్మించిన వైసీపీ కార్యాలయంపై సమాచారం సేకరించి త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.


Also Read: YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష