YS Jagan: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామపంచాయతీ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఓ షాపు వద్ద ఉంటున్న నాగమల్లేశ్వరరావుపై అకస్మాత్తుగా అత్యంత పాశవికంగా ప్రత్యర్థులు దాడి చేశారు. కర్రలతో తలపై కసికసిగా బాదుతూ ఆయన ప్రాణాలు తీసేందుకు యత్నించారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్ుట తెలిపారు. 

ప్రత్యర్థుల దాడిలో గాయపడిన నాగమల్లేశ్వరరావుకు ముందు పొన్నూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతోంది.  

వైసీపీ నేత నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతలే హత్యాయత్నం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. రెడ్‌ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.  ఇంకా ఆయన ఏమన్నారంటే..." చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను." అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 

అంతకు ముందు వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు దాడులు-ఆరు కేసుల అన్నట్టు చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రోజూ వైసీపీ నేతలే టార్గెట్‌గా కేసులు పెట్టడమో హత్యలు చేయడమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమల్లేశ్వరరావుపై దాడి పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే జరిగిందా ఆని ప్రశ్నించారు. నిందితులను రక్షించేందుకు పోలీసులు, ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారిని ఊరు దాటించింది వారేనని అన్నారు. అన్నింటినీ తగిన గుణపాఠం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని అంబటి వార్నింగ్ ఇచ్చారని అన్నారు.