మార్కాపురం: ‘2029లో అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ముందు మీరు అధికారంలోకి రావాలి కదా. మీరు అధికారంలోకి ఎలా వస్తారో నేనూ చూస్తాను అని’ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రౌడీలు, గూండాల గర్జనలకు భయపడితే రాజకీయాల్లోకి రావడం సాధ్యం కాదన్నారు. రూ. 1290 కోట్ల విలువైన త్రాగునీటి పథకానికి మార్కాపురంలో పవన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
‘వెలిగొండ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు కావాలి. భూ పరిహారం కోసం ఎక్కువ డబ్బు కావాలి. వైసీపీ భారీగా అప్పులు చేసింది కానీ ప్రాజెక్టు పూర్తి చేసి మీ దాహాన్ని తీర్చలేదు. 2029లో అధికారంలోకి వస్తాం మీ అంతు చూస్తామని అంటున్నారు. మీరు అధికారంలోకి రాకుండా మేం చూస్తాం. వ్యక్తిగతంగా వైసీపీ నేతలపై నాకు ఎలాంటి కోపం, కక్ష లేవు. మీరు అందర్నీ భయపడితే ఎదుర్కొని గెలిచాం. వైసీపీ వాళ్లు అద్భుతంగా పాలించి ఉంటే మీరు 11 సీట్లకు పరిమితం అయ్యేవాళ్లు కాదు. మీరు 151 సీట్లు గెలిచిన సమయంలో 2 చోట్ల నేను ఓడిపోయాను. ప్రజల మద్ధతుతో గెలిచి అధికారంలోకి వచ్చాం.
కూటమిలో ఒకరు ఎక్కువ కాదు, తక్కువ కాదుఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ అని కాదు. ఎవరి ప్రాధాన్యాత వారికి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలంటే సీఎం చంద్రబాబు లాంటి నేత అవసరం మనకు ఉంది. చంద్రబాబు నాయకత్వంలో పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తున్నాం. జల్ జీవన్ మిషన్ కు 2019 నుంచి 2024 వరకు మోదీ ఆధ్వర్యంలోని కేంద్రం రాష్ట్రానికి రూ.26 వేల కోట్లు మంజూరు చేసింది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ వైసీపీ ప్రభుత్వం ఇవ్వని కారణంగా రూ.4 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. కేవలం పైపులు వేస్తే నీళ్లు రావు.
‘మొదటి విడత 1390 కోట్లతో ప్రకాశం జిల్లాలో జల్ జీవన్ మిషన్ మొదలుపెట్టాం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రకాశంలో జిల్లాలో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇది. 18 మండలాలు, 572 గ్రామాల్లో 10 లక్షలకు పైగా ప్రజలకు తాగునీటిని అందిస్తాం. 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, పైపులైన్లు వేసి ప్రకాశం ప్రజలకు తాగునీరు అందిస్తాం. వైసీపీ ఓడిపోతుందని తెలిసిన తరువాత ఎన్నికల ముందు శిలాఫలకం వేశారు. కూటమి సర్కార్ ప్రణాళికా బద్ధంగా పనులు చేసి 18 నుంచి 20 నెల్లో ప్రజలకు మంచి నీళ్లు అందిస్తాం’ అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.