YS Sharmila About YS Jagan: విజయవాడ: గత 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని.. అధికార వైఎస్సార్ సీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల వల్లే ఏపీలో భూతద్దం పెట్టి చూసినా డెవలప్ మెంట్ కనిపించడం లేదని YS Sharmila సెటైర్లు వేశారు. రాజధాని అమరావతిని సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు (Chandrababu).. చివరికి 3D గ్రాఫిక్స్ చూపించారని సెటైర్లు వేశారు. ఇక జగన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి.. ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. రాజధాని ఏది అంటే మనకే తెలియదు, ఇదేనా చంద్రబాబు,జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించారు. విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యలు చేపట్టారు. గిడుగు రుద్రరాజు PCC నియామక పత్రాలను షర్మిలకు అందించారు. భాద్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నేతలు పలువురు పాల్గొన్నారు.


అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ షర్మిల..
‘దివంగత నేత YSR రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ కి PCCగా పనిచేశారు. రెండు సార్లు YSR ముఖ్యమంత్రిగా గెలిచారు. నేడు అదే PCC పదవిని.. వైఎస్సార్ బిడ్డను నమ్మి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నమ్మి ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంత నమ్మకాన్ని నాపై ఉంచినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్న. రాష్ట్రానికి చెందిన నాయకులు, క్యాడర్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు’ వైఎస్ షర్మిల.


జగన్ సీఎం అయ్యాక ఏ పోరాటం చేయలేదు.. 
మోదీ క్యాబినెట్ లో చంద్రబాబు పార్టీ నేతలు మంత్రి పదవులు తీసుకున్నారు. తరువాత హోదా పక్కన పెట్టీ ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం రోజు హోదా అన్నారు.. కేంద్రంపై అవిశ్వాసం పెడతా అన్నారని గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాపై, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదని విమర్శించారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టిందని, ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదన్నారు. జగన్, చంద్రబాబు ప్రత్యేక హోదా తేవడంలో విఫలమయ్యారు, స్వలాభం కోసం రెండు పార్టీలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాయని సంచలన ఆరోపణలు చేశారు.  


రాష్ట్ర ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పులు..
గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో YSRCP అధికారంలో ఉండగా.. అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉంది. కానీ ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రం విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు కాగా, టీడీపీ సర్కార్ చేసిన అప్పులు 2 లక్షలు కోట్లు, జగన్ మోహన్ రెడ్డి చేసిన అప్పులు 3 లక్షల కోట్లు.. వీటితో పాటు కార్పొరేషన్ లోన్స్, ఇతర బకాయిలు కలుపుకుంటే రాష్ట్రం నెత్తిన 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని.. కానీ బూతద్దం పెట్టి చూసినా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. 


రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదు 
రాజధాని ఉందా..? రాజధాని కట్టగలిగారా ? ఇతర రాష్ట్రాలకు మెట్రో ఉందని.. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదన్నారు. 10 ఏళ్లలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలు కూడా రాలేదని, పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు  ఉద్యోగాలు వచ్చేవనన్నారు వైఎస్ షర్మిల. ఆంధ్రలో రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవు. మరోవైపు అభివృద్ధి లేదు కానీ.. దళితులపై దాడులు మాత్రం 100 శాతం పెరిగాయంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా.. దోచుకోవడం దాచుకోవడం ఇదే పనిగా మారిందన్నారు. 


ఆ రాష్ట్రాలు సాధించుకున్నాయి.. 
‘ప్రత్యేక హోదా హామీ ఇచ్చి 10 ఏళ్లు అయ్యింది, కానీ హోదా మాత్రం రాలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటి ఉద్యోగాలు వచ్చేవి.. పరిశ్రమలు వచ్చేవి. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు అనడం కంటే.. పాలకులు తేలేకపోయారు అనడం కరెక్ట్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా 2 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. 500 శాతం కొత్త ఉద్యోగాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో హోదా ఇవ్వడం ద్వారా 10 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. ఏపీకి మాత్రం స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదు. ఏపీలో గత 10 ఏళ్లలో పాలకులు ప్రత్యేక హోదా తేవడం లో విఫలం అయ్యారు.. వాళ్లకు చేతకాలేదు. విభజన సమయంలో కాంగ్రెస్ 5 ఏళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ 10 ఏళ్లు ఇవ్వాలని ఊదర గొట్టారు. కానీ ఏపీకి అన్యాయం చేశారు’ అని రాష్ట్ర ప్రభుత్వంపై, కేంద్రంపై షర్మిల విమర్శలు గుప్పించారు.