YS Sharmila PCC Chief: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh News) కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల (YS Sharmila) నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న వేళ... శనివారం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. రాజశేఖర్‌రెడ్డికి కాంగ్రెస్‌, పార్టీ సిద్ధాంతాలంటే ప్రాణంతో సమానమన్న ఆమె...తండ్రి ఆశీర్వాదం కోసమే ఇడుపులపాయకు వచ్చినట్లు వెల్లడించారు. దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థమే లేకుండా పోయిందన్న షర్మిల.... రాజ్యాంగానికి అసలు గౌరవమే లేదన్నారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలు నిలబడాలని, దేశానికి మంచి జరగాలనే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస చేసిన షర్మిల... ఉదయం విమానంలో విజయవాడకు  వెళతారు. ఉదయం పదకొండు గంటలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో రేపటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 


తెలంగాణలో మొన్నటి వరకు సొంత పార్టీ నడిపిన షర్మిల...వైఎస్సాఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో...కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించింది పార్టీ అధిష్ఠానం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా, వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే...ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రెండు వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటంతో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. 2019లో జగన్‌ అధికారాన్ని చేపట్టే వరకు....రాజకీయంగా షర్మిల అండగా నిలిచారు.