ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టనున్న వేళ ఆమె కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఆమె గన్నవరం విమానాశ్రయానికి రాగా.. అక్కడి నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో షర్మిల ఏపీ కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎనికే పాడు వద్ద వాహనాలను పోలీసులు మళ్లించారు. వాహనాలను మళ్లించినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రోడ్డుమీద బైఠాయించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. అందుకే తన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ‘భయపడుతున్నారా సార్’ అంటూ షర్మిల మాట్లాడారు.


ఏపీ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. పోలీసులు కావాలనే షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము ముందే రూట్ ప్లాన్ పోలీసులకు ఇచ్చామని.. అయినా పోలీసులు అడ్డంకులు పెడుతున్నారని అన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. తమ కాన్వాయ్ కు అనుమతి ఇవ్వకపోతే మొత్తం విజయవాడ మొత్తాన్ని బంద్ చేస్తామని గిడుగు రుద్రరాజు హెచ్చరిక చేశారు.


ఏపీసీసీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిలకు ఏపీసీసీ కార్యాలయంలో ఇప్పటికే ఛాంబర్ కూడా సిద్ధమైంది. ఏపీ కాంగ్రెస్ కార్యాలయం అయిన ఆంధ్రరత్న భవన్‌లో షర్మిలకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఛాంబర్ వద్ద నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.