YS Sharmila Press Meet: బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఏపీకి ఏం చేయలేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్న బీజేపీ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లల్లో ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏపీలో కోటి ఉద్యోగాలు రావాల్సి ఉందని.. ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అందరినీ మోసం చేసింది కాబట్టే కాంగ్రెస్ ప్రశ్నిస్తుందని అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో వైఎస్ షర్మిల విలేకరుల సమావేశం నిర్వహించారు.


యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మ్యానిఫెస్టో‌ విడుదల చేసిందని.. భర్తీ భరోసా పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. 25 ఏళ్ల‌లోపు ఉన్న డిగ్రీ, గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ కోర్సుల వారికి అప్రెంటీస్ ద్వారా ఏడాదికి లక్ష ఇస్తామని అన్నారు. ‘‘పేపర్ లీక్ లను పూర్తిగా అరికట్టి ప్రత్యేక చట్టాలు తెస్తాం. జుమాటో, క్యాబ్ హోల్డర్స్ వంటి వారికి ఎటువంటి భద్రత లేదు. ఇటువంటి వారికి సోషల్ సెక్యూరిటీ ఉండేలా చట్టాలు తీసుకొస్తాం. యువ రోషిణి ద్వారా ఐదు వేల‌కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. 40 ఏళ్ల లోపు వారికి రుణాలు ఇచ్చి ఆర్ధికంగా నిలబడేలా చేస్తాం. రాహుల్ గాంధీ యువత, నిరుద్యోగ సమస్యలపై స్పందించి ఈ మ్యానిఫెస్టో పెట్టారు. ఏపీలో లక్షల మందికి ఉద్యోగాలు లేవు. 


డిగ్రీ ఉన్నా పది వేలలోపు జీతాలకి పని చేసుకుంటున్నారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆనాడు చంద్రబాబును తిట్టిన జగనన్న ఈ ఐదేళ్లల్లో ఏం‌చేశారో ప్రజలకు చెప్పాలి. కనీసం రెండు శాతం కూడా ప్రభుత్వం శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మెగా డీఎస్సీ పేరుతో 23 వేల ఉద్యోగాలు అని చెప్పారు. నేడు ఆరు వేల ఉద్యోగాలతో ధగా డీఎస్సీ విడుదల చేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు నోటిఫికేషనా?


ఇదేనా యువతపై జగనన్నకి ఉన్న చిత్తశుద్ధి. ఐదేళ్లుగా ఏం చేస్తున్నారు. ‌గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? నాడు చంద్రబాబు ఏడు వేల ఉద్యోగాలు ఇస్తే సిగ్గులేదా అన్నారు. మరి మోసం చేసిన జగన్ ను ఏమని పిలవాలి.. మేము ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపితే అరెస్టు చేశారు.. కేసులు పెట్టారు. బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముంది? ఏపీలో బీజేపీకి బి పార్టీ గా వైసీపీ ఉంది. బీజేపీకి వారసులు అని జగన్ నిరూపించుకున్నారు. ఈ మోసాలను మేం ప్రజలకు వివరిస్తాం.


పొత్తుల పైనా కీలక వ్యాఖ్యలు


ఈ పొత్తులను ఎవరూ స్వాగతించడం లేదు. హోదా ఇవ్వకపోయినా బీజేపీతో పొత్తు ఎందుకు? అసలు ఏపీలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. జగన్, చంద్రబాబులు హోదాపై ఉద్యమం చేశారా? ఏపీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో పొత్తుతో గెలిచారు. ఆ తరువాత మోదీని తిట్టారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చారు. పవన్ కళ్యాణ్, జగన్ ను కూడా నేను అడుగుతున్నా. జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారు. 


అందుకే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీయలేదు. బీజేపీకి బానిసగా బతకాల్సిన ఖర్మ ఎందుకు? బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం‌ కాబట్టే అవినీతిని పట్టించుకోరు. బీజేపీకి తొత్తులుగా ఉంటే సీబీఐ, ఈడీ పని చేయదు. మిమ్మల్ని ప్రశ్నిస్తే వెంటనే వారు వాలిపోతారు. సిద్దం సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేస్తున్నారు. అంత డబ్బులతో జనాలను పోగేసుకుని మళ్లీ‌మాయ చేస్తున్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి’’ అని షర్మిల మాట్లాడారు.