గన్నవరం వదిలి వెళ్ళే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యార్లగడ్డ వెంటకరావు తెలిపారు. కార్యకర్తల కోసం ఇక్కడే ఉంటానని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. వంశీతో కలసి పని చేస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా తాను అంగీకరించలేదన్నారు.


అభిమానులతో యార్లగడ్డ సమావేశం
గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు వరుస సమావేశాలతో రాజకీయ కాక పుట్టిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పని చేసిన కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ వెంకటరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 


ఈ సమావేశానికి కార్యకర్తలను రానీయకుండా అడ్డుపడి బెదిరింపులకు గురి చేశారని అన్నారు యార్లగడ్డ వెంకటరావు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టారని అన్నారు. అయినా తనపై అభిమానంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారని చెప్పారు. తాను కూడా కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు.


 అమెరికా నుంచి వచ్చి జగన్ కోసం
ఈ సమావేశంలో తన రాజకీయాల ఎంట్రీపై యార్ల గడ్డ వెంకటరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై మక్కువతో అమెరికా నుంచి వచ్చానని చెప్పారు. యార్లగడ్డ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టైంలో జగన్ పిలిచి మాట్లాడినట్టు వెల్లడించారు. గన్నవరంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది అక్కడకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి చెబితే వచ్చినట్టు పేర్కొన్నారు. 


2017 వరకు గన్నవరం విమానాశ్రయం తప్ప తనకు ఎవరూ తెలియదన్నారు యార్లగడ్డ. కానీ 2019 ఎన్నికల్లో పోటీ తర్వాత పెద్ద కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని వివరించారు. నియోజకవర్గ నాయకులను దుట్టా రామచంద్రరావు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. 


1983కి ముందు పుచ్చలపల్లి సుందరయ్య సీపీఎంకి కంచుకోటగా గన్నవరంను మార్చారని, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే గెలిచిందన్నారు యార్లగడ్డ. రెండు సార్లు ఇండిపెండెంట్‌లను గెలిపించిన ఘనత ఆ నియోజకవర్గ ప్రజలదని అన్నారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో తొక్కని గడప లేదని తెలిపారు. కేవలం 270 ఓట్లు తేడాతో ఓడిపోయానని అన్నారు.


వంశీతో కలసి పని చేయను...
తెలుగు దేశం పార్టీ హయాంలో వైఎస్సార్ సీపీ నాయకులు మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని, 2019 ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆనందపడాలో తెలుగు దేశం పార్టీలో గెలిచిన శాసన సభ్యుడిని పార్టీలోకి తీసుకువచ్చారని బాధపడాలో తెలియటం లేదన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నామినేటెడ్ పదవులు, వాలంటీర్లును నియమించామని, వంశీని ఇద్దరు మంత్రులు వెంటపెట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లారని తెలిపారు. 


ఎమ్మెల్యే వంశీతో కలిసి పని చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారని యార్లగడ్డ వివరించారు. తెలుగు దేశం పార్టీ శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ లాంటి సౌమ్యంగా ఉండే వ్యక్తితో అయితే పని చేసేవాడినని తెలిపారు. 


గన్నవరంలోనే పోటీ చేస్తా...
రాజకీయాల్లో ఉన్నంత కాలం తాను గన్నవరం నియోజకవర్గంలోనే ఉంటానని, ఇక్కడే పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఎమ్మెల్యే వంశీతో కలిసి పని చేస్తే ఎమ్మెల్సీ ఇస్తారని చాలా మంది నాయకులు చెప్పారని, ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి కోసం వంశీతో కలవనని తెలిపారు. నియోజకవర్గంలో 104 గ్రామాల్లో పాదయాత్ర చేసేందుకు యువతే కారణమని, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఫామ్‌లు, ఎమ్మెల్యే వంశీకి ఇస్తే ఏ ముఖంతో గన్నవరం రావాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులకు అన్యాయం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా నిజమైన వైసీపీ నాయకులకు అన్యాయం జరిగిందన్నారు. తన కోసం పని చేసిన వైసీపీ కార్యకర్తలకు ఏమి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.