Krishna District News: ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడులో చాలా ఆసక్తికర సంఘటన జరిగింది. వైసిపి కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా టిడిపి నేతలతోపాటు వైసిపి నేత హాజరు కావడంపై ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.
2024 ఎన్నికల తర్వాత వైసీపీకి పలువురు గుడ్ బై
ఇప్పటికే పలువురు వైసిపి నేతలు 2024 ఎన్నికల ఫలితం తర్వాత జగన్‌కు బై బై చెప్పి కూటమి వైపు అడుగులు వేశారు. వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య లాంటి వారు ఉన్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరకపోయినా వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆళ్ళ నాని,గ్రంధి శ్రీనివాస్,రాపాక వర ప్రసాద్,వాసిరెడ్డి పద్మ లాంటి ప్రముఖులు ఉన్నారు. ఇక పార్థసారథి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వారు ఎన్నికలకు ముందే జగన్‌కు టాటా చెప్పేసి కూటమి వైపు వచ్చేశారు. ఇప్పుడు జోగి రమేష్ కూటమినేతలతో కలిసి కనపడేసరికి ఏపీ పాలిటిక్స్‌లో కొత్త డిస్కషన్ మొదలైంది.
Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఇటీవల కాలంలో కాస్త జోరు తగ్గిన జోగి రమేష్
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు అత్యంత విధేయుల్లో ఒకరిగా జోగి రమేష్ మెలిగారు. దానికి తగ్గట్టే ఆయనను మంత్రిని చేసిన జగన్ అప్పటి మైలాపురం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదాల్లో ఇద్దరూ తన పార్టీ వారే అయినా జోగి రమేష్ వైపే నిలబడ్డారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారడం వెనక ఇది కూడా ఒక కారణం అని ఆయనే చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేశారన్న ఆరోపణ కూడా జోగి రమేష్ ఎదుర్కొంటున్నారు. దీనిపై నమోదైన కేసులో ఇప్పటికే పోలీసులు జోగి రమేష్‌ను విచారించారు. వీటన్నిటి నేపథ్యంలో గత కొంతకాలంగా జోగి రమేష్ రాజకీయంగా తన స్పీడ్ తగ్గించారు. అయితే ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడలేదు.
విగ్రహ ఆవిష్కరణ కోసమే ర్యాలీ
రాజకీయంగా చర్చ ఎలా ఉన్నా తాజాగా వైసీపీ నేత జోగి రమేష్ నూజివీడులో జరిగిన ర్యాలీలో పాల్గొన్నది కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమం గానే చూడాలని జోగి రమేష్ వర్గీయులు చెబుతున్నారు. ఇందులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కోసమే కూటమి నేతలు పార్థసారథి, కొనికళ్ళ నారాయణ లాంటి వారితో కలిసి పాల్గొన్నారని చెబుతున్నారు. తన పార్టీ నేతలు తనతో మాత్రమే ఉండాలని భావిస్తారని పేరున్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారో చూడాలి.
Also Read: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి