World Telugu Writers Mahasabhalu : 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఆడంబరంగా ప్రారంభమయ్యాయి. కేబీఎన్‌ కళాశాల కేంద్రంగా ఈ నెల 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు జరగనున్న ఈ సభల్లో మొదటి రోజున పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని రామోజీరావు ప్రధాన వేదిక అయింది. ఈ సందర్భంగా హాజరైన సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సాహిత్యం, వైభవం గురించి మాట్లాడిన సుప్రీంకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. పర భాషను నేర్చుకోండి, కానీ వ్యామోహం పెంచుకోకండని సూచించారు. నందమూరి తారక రామారావు వంటి వారి వల్ల మన భాషకు, తెలుగు వాళ్లకు గౌరవం పెరిగిందని చెప్పారు. 


అక్కడ ఉన్న ఐక్యత, మన దగ్గర లేదు


తమిళనాడులో తమ భాషాభివృద్ధి కి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని ఎన్వీ రమణ చెప్పారు. ఆ తరహాలో మన దగ్గర పాలకులు స్పందించడం లేదని, అక్కడ ఉన్న ఐక్యత, మన దగ్గర లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను కూడా తెలుగు భాషోద్యమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ప్రజల మద్దతుతోనే మన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.




సర్కారుకు చురకలు


వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగు భాషను అణగదొక్కుతున్నారని.. తెలుగు భాషాభివృద్దిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని ఎన్వీ రమణ ఆరోపించారు. తగినంత గుర్తింపు కూడా మన భాషకు దక్కడం లేదన్నారు. కొన్ని దేశాల్లో వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అద్భుతాలు సాధించారని, వారి సాంకేతికతను, విజయాలను వారి భాషలోనే రాసుకుంటున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తరహాలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషలోనే ఆదేశాల కాపీలు‌ ఇచ్చే ఆలోచన చేయాలని, తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుందన్నారు. తెలుగు భాషను పరిపుష్టం చేయాలనే అలోచనపై ప్రభుత్వం సానుకులంగా స్పందించాలని కోరారు. మీడియా కూడా అందుకు సహకరించాలని, లేదంటే భవిష్యత్తు లొ తెలుగు పేపర్లు, ఛానళ్లు చూసే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.


పర భాషపై వ్యామోహం తగదు


మన సంస్కృతి నాశనం‌ కాకుండా చూసుకోవాలని గాంధీజీ చెప్పేవారని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. పర భాషను నేర్చుకోవాలి కానీ.. వ్యామోహం పెంచుకోకండని సూచించారు. ప్రస్తుతం పెట్టుబడిదారులు ఇంగ్లీషు భాష ఉంటేనే ఉద్యోగాలు అనే పరిస్థితి కల్పించారని, కానీ తెలుగు మీడియంలో ‌చదివి కూడా దేశ విదేశాల్లో రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారని చెప్పారు. కొన్ని దేశాల్లోనూ వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అద్భుతాలు సాధించారన్నారు.


తెలుగు భాష - అందమైన భాష


ఒక సంగీతం తరహాలో తెలుగు భాష అనేది ఓ అందమైన భాష అని ఎన్వీ రమణ అన్నారు. మానవ బంధాలతో కుడిన రచనలే కలకాలం నిలిచి ఉంటాయని, కన్యాశుల్కం వంటి రచనలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. తెలుగు భాషకు మద్దతు ఇచ్చేవారికే ఓటు అని ప్రజలతో చెప్పించండని, అప్పుడే మన భాష అభివృద్ధి అవుతుందని, వైభవం తప్పకుండా సాకారం అవుతుందని ఎన్వీ రమణ వివరించారు.


ఇక మార్పు పేరుతో ముద్రించిన  మాహా సభల ప్రచురణ గ్రంధాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. ఇతర భాషలు నేర్చుకోండి.. కానీ మాతృభాషపై మమకారం పెంచుకోండని చెప్పారు. ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ తెలుగు వాళ్లు ముందంజలో ఉన్నారన్నారు. కృత్రిమ విధానంలో భాష తెలుసు కోవడం సరి కాదని, సహజసిద్ధంగా ఉండేలా మాతృ భాషపై పట్టు సాధించాలని సూచించారు. ఇంగ్లీష్ రాకుండానే కపిల్ దేవ్ ఇండియా కెప్టెన్ అయ్యారని, ఆ తర్వాత భాష నేర్చుకున్నారన్నారు. అదే తరహాలో అందరూ మాతృభాషపై మక్కువ పెంచుకోండి, తర్వాత పరభాష నేర్చుకోండని చెప్పారు. ప్రపంచ తెలుగు రచయిత ల సంఘం సంస్థాగతంగా వృద్ధి చెందడానికి తన ‌వంతు సహకారం అందిస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.


Also Read : Palasa Latest News: అధికారుల తప్పిదంతో జీతాలు రాని దుస్థితి - పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలోని ఉద్యోగుల వెతలు