Viral News: చాలామంది దేవుళ్లకు అనేక రకాల మొక్కులు మొక్కుంటారు. ముఖ్యంగా గుండు కొట్టించుకోవడం, విలువైన కానుకలు సమర్పించడం, కాళ్ల మీద, మోకాళ్ల మీద నడుచుకుంటూ వస్తామని, అలాగే తులాభారం ఇస్తామని అనుకుంటారు. వారి కోరిక తీరిన వెంటనే వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. కొబ్బరి కాయలు, పూలు, పండ్లు, చక్కెర, బెల్లం... చాలా వాటితో తులాభారం ఇస్తుంటారు చాలా మంది. కానీ తాజాగా ఓ వ్యక్తి టమోటాలను తులాభారంగా ఇచ్చారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
టమోటాలతో తులాభారం ఎందుకంటే..?
అనకాపల్లి జిల్లాలోని నూకాలమ్మ ఆలయంలో ఒక భక్తుడు టమోటాలతో తులాభారం ఇచ్చారు. కేజీ టమాటా 120కి పైగా ఉండటంతో తులాభారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంతో విలువైన టమాటాలను తులాభారం చేస్తుండగా.. ఆలయానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అనకాపల్లికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య తులాభారం నూకాలమ్మ ఆలయంలో జరిగింది. 51 కేజీల టమాటాలతో తులాభారం నిర్వహించారు. అనంతరం బెల్లం, పంచదారలతో తులాభారంగా ఇచ్చి తమ మొక్కును తీర్చుకున్నారు. వీటిని అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. టమాటాలతో తులాభారం నిర్వహించడం భక్తుల ఆసక్తిగా తిలకించారు.