Vijayawada-Shirdi Flight: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26 నుండి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో పాటు సర్వీసు ప్రారంభించేందుకు షెడ్యూల్ ను కూడా ప్రకటించింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఏటీఆర్ 72-600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలు దేరి మూడు గంటలకు షిర్డీ చేరుకుంటుంది. అలాగే రోజూ మధ్యాహ్నం షిర్డీ నుండి మరో విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలు దేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుందని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
విజయవాడ నుండి షిర్డీకి వెళ్లడానికి టికెట్ ధరలు రూ.4,246 నుండి ప్రారంభం అవుతాయి. అలాగే షిర్డీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడానికి రూ.4,639 గా నిర్ణయించింది ఇండిగో ఎయిర్ లైన్స్. ఇప్పటి వరకు షిర్డీ వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు విమాన సర్వీసులు ప్రారంభించడంతో చాలా తక్కువ సమయంలోనే విజయవాడ నుండి షిర్డీకి, షిర్డీ నుండి విజయవాడకు వెళ్లొచ్చు. విజయవాడ నుండి షిర్డీకి సుమారు 2 గంటల 50 నిమిషాల్లో చేరుకోవచ్చు.
విశాఖ నుంచి బెంగళూరుకు విమాన సర్వీసులు
విశాఖ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు మరో క్రొత్త విమానం అందుబాటులోనికి వచ్చింది. కొత్తగా ప్రారంభించిన " ఆకాశ " ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఇకపై విశాఖ నుంచి ఎగరనుంది. దీనిని ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉండగా వాటిలో మరిన్ని నూతన సర్వీసులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పలు ఎయిర్ లైన్స్ సంస్థలకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆకాశ ఎయిర్ లైన్స్ కు విశాఖ, బెంగళూరు మధ్య నడపనున్న తొలి సర్వీసును విశాఖ విమానాశ్రయంలో ప్రారంభించారు.
విశాఖ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి విశాఖకు..
అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నూతన సర్వీసు విశాఖ నుంచి నేరుగా బెంగళూరుకు, బెంగళూరు నుంచి విశాఖకు రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు మరిన్ని విమానాలు అదనoగా నడపడం వల్ల ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు మరింత సులభంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విశాఖ నుంచి నూతన సర్వీసులు నడపాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా నగరాలకు నూతన సర్వీసులు నడపాలని మంత్రి అమర్నాథ్ ఆకాశ ఎయిర్ లైన్స్ యాజమాన్యాన్ని కోరారు. ప్రస్తుతం ఆకాశ సంస్థ 9 ప్రధాన నగరాల్లో తన సర్వీసులను నడుపుతోందని విశాఖ నుంచి తన పదో సర్వీసును ప్రారంభించడం ఆనందకరంగా ఉందని అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో త్వరలో గ్లోబల్ సమ్మిట్ జరగనుందని, అలాగే జీ 20 సమావేశాలకు సంబంధించి కూడా విశాఖ వేదిక కానుందని భావిస్తూ మరిన్ని విమాన సర్వీసులు అవసరం ఉందన్నారు.