Nuzvid News : ఏలూరు జిల్లా నూజివీడులో దారుణం జరిగింది. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో నర్సరీ విద్యార్థి మృతి చెందాడు. నూజివీడు పట్టణంలోని విష్డమ్ ప్రైవేట్ స్కూల్లో మరుగుదొడ్డి వద్ద గోడ కూలి విద్యార్థి నీల మణికంఠ (4) మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


అసలేం జరిగింది? 


నూజివీడులో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. గోడ కూలడంతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నూజివీడు పట్టణంలోని  విష్డమ్(wishdom)  ప్రైవేట్ పాఠశాలలో మరుగుదొడ్డి వద్ద గోడ కూలి నర్సరీ చదువుతున్న విద్యార్థి నీల మణికంఠ (4) మృతి చెందడం నూజివీడులో విషాదాన్ని నింపింది. మొత్తం ముగ్గురు విద్యార్థులు ఈ ప్రమాదానికి గురికాగా, ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు అవ్వడంతో వారిని తల్లిదండ్రులకు యాజమాన్యం అప్పగించింది. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని బయటికి తెలియనీయలేదు. ఈ పాఠశాలను పాతకాలంనాటి భవనంలో నిర్వహిస్తున్నారు. ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన కందుల కోటేశ్వరరావు, నందినిల కుమారుడు నీల మణికంఠ (4) ను విష్డమ్ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాయి. అయితే మధ్యాహ్నం సమయంలో టాయిలెట్ కు వెళ్లిన మణికంఠ గోడ కూలడంతో రాళ్ల కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.  


చిన్నదెబ్బ అంటూ సమాచారం 


మణికంఠను చికిత్స కోసం స్థానిక మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మణికంఠ మృతి చెందినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. నూజివీడు పట్టణ ఎస్సై శివన్నారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తల్లిదండ్రులకు మణికంఠ ఒక్కడే కుమారుడు. మంచి పాఠశాలలో చదివిస్తే ప్రయోజకుడు అవుతాడని భావించి ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు వాపోయారు. కేవలం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తాము కుమారుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.  మణికంఠ తల్లిదండ్రులకు మీ అబ్బాయికి చిన్న దెబ్బ తగిలింది అంటూ సమాచారం ఇచ్చారని, తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదని తండ్రి ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆసుపత్రికి వచ్చి చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి, తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేసి మణికంఠ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోలీసులను కోరారు. 


బిల్డింగ్ పై నుంచి పడి అంధ విద్యార్థి మృతి


 హైదరాబాద్ లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. అంధ విద్యార్థుల స్కూల్లో అనుకోని విషాదం జరిగింది. బిల్డింగ్ పైనుంచి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. కేర్ టేకర్ బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో విద్యార్థి లక్ష్మి గౌతమ్ శ్రీకర్ బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. 12 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థి లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ఆరో అంతస్తు నుంచి కిందకి పడిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు