Kanaka Durga Temple EO:
విజయవాడ: ఏపీలో విజయవాడ కనకదుర్గ గుడి ఈవో సహా కొందరు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబను బదిలీ చేశారు. దుర్గ గుడి నూతన ఈఓగా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ జవహార్ రెడ్డి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
డిప్యూటీ కలెక్టర్ పెద్ది రోజాను కృష్ణా జిల్లా డీఆర్ఓగా నియమించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషన్ బాధ్యతల నుంచి ఆమెను బదిలీ చేశారు. కృష్ణా జిల్లా డీఆర్ఓ వెంకట రమణను బాపట్ల జిల్లా డీఆర్ఓగా ట్రాన్స్ ఫర్ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎస్వీ నాగేశ్వర రావును ఎన్టీఆర్ జిల్లా డీఆర్ఓగా నియమించారు. ఎన్టీఆర్ జిల్లా డీఆర్ఓగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ ను కనకదుర్గ ఆలయం ఈవోగా నియమించారు. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
దుర్గగుడి ఈఓ బదిలీపై చర్చ..
గత కొంతకాలంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబకి, చైర్మన్ కర్నాటి రాంబాబుకి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు దగ్గర పడుతున్న సమయంలో ఈఓని బదిలీ చేయడంతో హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయ కోణంలోనే బదిలీ జరిగింది అంటూ ప్రచారం జరుగుతోంది. దుర్గ గుడి ఛైర్మన్ గా కర్నాటి రాంబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఆలయం అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఈవో అని అధికార పార్టీ వైసీపీ నేతలు సైతం ఆరోపించారు.