Chandrababu Arrest: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఓ క్రిమినల్‌ను అరెస్ట్ చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారని, తనకు అనుకూలమైన వారికి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రజాధనం దోచుకున్న ఎంతోమందిని గతంలో అరెస్ట్ చేశారని, అందులో భాగంగానే చంద్రబాబును కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేవన్నారు. అన్నీ ఆధారాలు సేకరించాకే చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తమ్మినేని పేర్కొన్నారు.


మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పినట్లు రాజకీయాలు దిగజారిపోయాయని తమ్మినేని తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు హద్దుమీరి ప్రవర్తించారని, ఇలాంటి చర్యలు సరికాదని సూచించారు. గతంలో ప్రతిపక్ష పార్టీ నేతలు అసెంబ్లీలో ఎంతో హుందాగా ప్రవర్తించేవారని, ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ప్రశ్నలు వేసేవారని అన్నారు. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రశ్నలు వేసేవారని, కానీ ఇప్పుడు అలా జరగడం లేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.


దొరికింది దొరికినట్లుగా దోచుకుంటే ఎలా అని, అలా చేస్తే ప్రజలు ఊరుకోరని తమ్మినేని తెలిపారు. చంద్రబాబు తన నిజాయితీని కోర్టుల్లో నిరూపించుకోవాలని సూచించారు. సీఎంలు ప్రజాధనాన్ని కాపాడాలని, అలా కాకుండా దోపిడీ చేస్తే ప్రజలు సహించరని అన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని తమ్మినేని దర్శించుకున్నారు. నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు.


క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన తర్వాత వారి గురించి చర్చించుకోవడం అనవసరమని తమ్మినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రవర్తన ఎలా ఉందో ప్రజలందరూ చూశారని, ఆ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు. అసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ గమిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాల వల్ల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాలేకపోయానని, అందుకే ఇప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నట్లు చెప్పారు.


అయితే చంద్రబాబును క్రిమినల్ అని స్పీకర్ వ్యాఖ్యానించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, అవి కోర్టుల్లో ఇంకా తేలలేదని అంటున్నారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ఇప్పటివరకు కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని, అలాంటప్పుడు క్రిమినల్ అని స్పీకర్ ఎలా అంటారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ వ్యాఖ్యలు జుగుస్సాకరంగా ఉన్నాయని, ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఇప్పటికే టీడీపీ నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా భువనేశ్వరి, లోకేష్ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. లోకేష్ ఢిల్లీలో చేపట్టనుండగా.. భువనేశ్వరి రాజమండ్రిలో చేపట్టనున్నారు.