Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్ మరో ఘనతను సాధించింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(IGBC) నుంచి అత్యున్నతంగా భావించే ప్లాటినం రేటింగ్ ను కైవసం చేసుకుంది. అంటే విజయవాడ రైల్వేస్టేషన్ ను గ్రీన్ స్టేషన్ గా ఎంపిక చేశారు. స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన వసతులు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఇంధన సామర్థ్య వినియోగం, నీటి సామర్థ్యం, స్మార్ట్, పర్యావరణ హిత అంశాలను విశ్లేషించి విజయవాడ రైల్వే స్టేషన్ కు అత్యున్నత ప్లాటినం రేటింగ్ ను ఇచ్చారు. 


దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిసారి ప్లాటినం రేటింగ్ సాధిస్తున్న సికింద్రాబాద్ తో పోటీ పడుతూ ఈ సారి ఎనర్జీ ఎఫిషియెన్సీ - గ్రీన్ ఇనిషియేటివ్స్ లో భాగంగా ప్లాటినం అవార్డును సాధించింది విజయవాడ రైల్వే స్టేషన్. ప్రతి మూడు సంవత్సరాలకు కేంద్ర సర్కారు ప్రకటించే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) అయవార్డులను 2023లో సెప్టెంబర్ 5వ తేదీన ప్రకటించారు.


విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం పైకప్పుపై స్టార్ రేటింగ్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ చిత్రాలు, బీఎల్డీసీ ఫ్యాన్లు, డేలైట్ సెన్సార్లు, ఎనర్జీ మానిటరింగ్, సౌరశక్తి హీటర్లు వంటివి ఏర్పాటు చేశారు. దీని వల్ల క్లీన్ ఎనర్జీ, విద్యుత్ శక్తిని తక్కువ వాడటంపై స్టేషన్ లో చేపట్టిన చర్యలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి అత్యున్నత గుర్తింపు రావడానికి కారణం అయింది. అలాగే నీటి వినియోగాన్ని తగ్గించడానికి బోగీల శుభ్రతతో అధిక పీడన జెట్ వ్యవస్థలు, వ్యర్థనీటి శుద్ధి, వ్యర్థ జలాల పునర్వినియోగ చర్యలు నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తించింది ఐజీబీసీ. అలాగే స్టేషన్ లో ఆధునికీకరణపైనా దృష్టి సారించడం ఫలితాన్నిచ్చింది. 


స్టేషన్ లో వైపై, టికెట్ బుకింగ్ లు, పర్యాటక సమాచారం, బుకింగ్ కేంద్రాల్లో స్మార్ట్ కార్డ్ టికెటింగ్, ఏటీవీఎంలు, ఫుడ్ కోర్టులు, ఔషధ దుకాణాలు, 24 గంటలూ సీసీటీవీ కెమెరాలతో నిఘా వంటివి ఏర్పాటు చేశారు. అలాగే టచ్ స్క్రీన్ కియోస్కులను ఏర్పాటు చేశారు. కామ్‌టెక్‌ డిజైన్ ద్వారా కోచ్ వాటరింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అన్ని ప్లాట్ ఫారాల్లో లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఎస్కలేటర్లు, లగేజీ కోసం ట్రాలీ ఆధారిత సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే పికప్, డ్రాప్ పాయింట్లు, చైల్డ్ లైన్, వైద్య సదుపాయాలు తదితర అత్యాధునిక వసతులు గ్రీన్ సర్టిఫికేట్ వచ్చేందుకు దోహదం చేశాయి.


కేంద్ర పర్యావరణ డైరెక్టరేట్ పర్యవేక్షణలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(IGBC) ద్వారా దేశ వ్యాప్తంగా గ్రీన్ రైల్వే స్టేషన్లను ప్రోత్సహించేందుకు, అలాంటి విధానాలను అవలంభించేందుకు ఈ అవార్డులను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 6 అంశాల్లో ప్రధానంగా ఐజీబీసీ దృష్టి సారిస్తుంది. సమర్థవంతమైన స్టేషన్, పరిశుభ్రత, ఆరోగ్యం, ఇంధన సామర్థ్యం, వాటర్ ఎఫిషియెన్సీ, స్మార్ట్ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్స్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్‌ అంశాలపై ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ దృష్టి సారిస్తుంది. ఈ ఆరు అంశాల్లోనూ విజయవాడ స్టేషన్ 100 శాతం మెరుగైన ఫలితాలను సాధించి అత్యున్నత ప్లాటినం అవార్డుకు ఎంపికైంది.