ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి సీఎం జగన్ వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు హడావుడి చేశారు. చలో గుడివాడకు పిలుపునిచ్చారు. జగనన్నకు చెబుదామంటూ గుడివాడ బయల్దేరారు. ఇలా బయల్దేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.
సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ముందుగానే ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్న పోలీసులు సీపీఐ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.
సీపీఐ నగర్ కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాతో పాటు విజయవాడలో వేలాది మంది లబ్ధిదారులు టిడ్కో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిగతా వాళ్లు చేసిన పాపమేంటని నిలదీశారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే తాము చలో గుడివాడకు పిలుపునిచ్చామన్నారు. ఆయనకు శాంతియుతంగా వెళ్లి వినతి పత్రం ఇచ్చి వచ్చేస్తామని తెలిపారు.
శాంతియుతంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇలా మార్గ మధ్యలోనే అడ్డుకోవడం ఏంటని పోలీసులతో సీపీఐ నేతలు వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వారి వాదనలు పట్టించుకోకుండా వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరిలించారు. మరికొందర్ని విజయవాడ నుంచి జగ్గయ్యపేట గృహ నిర్బంధం చేశారు. దీనిపై సీపీఐ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు న్యాయం చేయకుంటే ఎక్కడ పర్యటనలు ఉంటే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని హెచ్చరిస్తున్నారు సీపీఐ నాయకులు