ఎన్టీఆర్ జిల్లాకు అతిపెద్ద కోర్టు భ‌వ‌నాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని 29 కోర్టులు ఒకేచోట ఏర్పాటు కావ‌టంతో క‌క్షిదారుల క‌ష్టాలు కూడా తొల‌గిపోతాయ‌ని న్యాయ‌వాదులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ న‌డి బొడ్డున‌ సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో త‌ల‌పెట్టిన కోర్టు భ‌వ‌నాల నిర్మాణం ఎట్ట‌కేల‌కు పూర్తి కావ‌టంతో ప్రారంభోత్స‌వానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చేతులు మీదుగా 9 అంత‌స్తుల భ‌వ‌నం ప్రారంభించ‌నున్నారు. దాదాపుగా 100 కోట్ల రూపాయ‌ల వ్య‌వయంతో 9 అంత‌స్తుల భ‌వాన్ని నిర్మించారు.


సీజే చేతులు మీదుగా జ‌రిగే ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ తో పాటుగా, సీఎం జ‌గ‌న్, న్యాయ‌కోవిధులు హ‌జ‌రు కానున్నారు. దీంతో ప్రారంభోత్స‌వ ఏర్పాట్లపై అధికారులు ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ మిశ్రా, ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.



2013లో శంఖుస్దాప‌న‌, ఇప్ప‌టికి అందుబాటులోకి 
విజ‌య‌వాడ సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో నిర్మించిన భ‌వ‌నం పూర్తి కావ‌టానికి 9 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. ఇందుకు అనేక కార‌ణాలు కూడ ఉన్నాయి. మ‌ధ్యలో రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌కు పైగా క‌రోనా కాలం రావ‌టంతో నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. ఇక ఆ త‌రువాత నిర్మాణ ప‌నులు ప్రారంభించ‌కుండా కాంట్రాక్ట‌ర్లు జాప్యం చేశారు. ఇందుకు ఆర్థిక ప‌ర‌మ‌యిన కార‌ణాల‌ను సాకుగా చూపించారు. బిల్లుల చెల్లింపులు ఆల‌స్యం కావ‌టంతో నిర్మాణం ముందుకు సాగ‌క‌పోవ‌టంపై న్యాయ‌వాదులు పలువురు హై కోర్టులో పిటిష‌న్ ను కూడా దాఖ‌లు చేశారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి న్యాయ‌స్దానం ఆదేశాలు ఇచ్చింది. ఆ త‌రువాత ఆర్ అండ్ బి అదికారులు నిర్మాణ ప‌నుల‌కు కాంట్రాక్ట్ సంస్థను మార్చి రీ టెండ‌ర్లు ఇచ్చారు. దీంతో నిర్మాణం ఎట్ట‌కేల‌కు పూర్త‌య్యింది. 3.70 ఎక‌రాల్లో న‌గ‌రానికి సెంట‌ర్ గా మ‌ల్టిస్టోరీడ్ కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం జ‌రిగింది.


జ‌స్టిస్ ర‌మ‌ణ‌కు డాక్ట‌రేట్


సీజేఐ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఈ నెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉప కులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ వెల్లడించారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన ర‌మ‌ణ‌ను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కులపతి హోదాలో గవర్నర్‌ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఎన్వీ రమణను విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. ఆయనకు వర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు ప్రయత్నించామని, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని, ఆ కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వీసీ అన్నారు.


విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసించిన మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం సముచితమంటూ ఈ అరుదైన అవకాశం వర్సిటీకి దక్కడంపై ఆచార్య రాజశేఖర్‌ ఆనందం వ్యక్తం చేశారు.  స్నాతకోత్సవ ఏర్పాట్ల పై అధికారుల‌తో సమీక్షించారు. గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్న విషయంపై జస్టిస్‌ ఎన్వీ.రమణకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. స్నాతకోత్సవానికి ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ హాజరవుతారు.