వంద ఎకరాల పైబడిన లేఅవుట్ల వద్ద టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పరిశ్రమల శాఖ సమావేశ మందిరంలో చేనేత, వస్త్రపరిశ్రమ, ఆప్కో, లేపాక్షి మరియు ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ లేఅవుట్ల వద్ద టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు ఆయన తెలిపారు.


రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద విస్తీర్ణంలో ఎన్నో లేఅవుట్లు ఉన్నాయని, వాటి దగ్గర్లో టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తే ఆయా లేఅవుట్లలోని మ్యాన్ పవర్ కు ప్రత్యేకించి మహిళా శక్తికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉంటాయనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచిస్తూ, ప్రాథమికంగా వందెకరాలు పైబడిన లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వున్నాయో  తొలుత గుర్తిస్తే, ఆయా లేఅవుట్ల వద్ద టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టవచ్చన్నారు. అలా గుర్తించిన ప్రాంతాల్లో టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను పలు మార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా గుర్తించవచ్చని అధికారులకు ఆయన సూచించారు.


ఆప్కో కార్యకలాపాలను మంత్రి సమీక్షిస్తూ ఆ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగు పర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే మార్కెటింగ్ కన్సల్టెంట్ ను నియమించుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఆప్కో వ్యాపారాన్ని, కార్యకలాపాలను మరింత మెరుగుపర్చాలంటే ప్రస్తుతం అనుసరిస్తున్న పి.డి. ఎక్కౌంట్ కు బదులు బ్యాంకు ద్వారా సులభ చెల్లింపు విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. అదే విధంగా ఆప్కో టర్నోవర్ ను  ఏడాదికి రూ.100 కోట్ల మేర పెంచే వ్యూహాత్మక ప్రణాళికను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.


అందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు సత్వరమే వచ్చేలా సహకరించాలని మంత్రి వారు కోరారు. లేపాక్షి కార్యకలాపాలను మంత్రి సమీక్షిస్తూ రాష్ట్రంలో నూతనంగా మరో 13 జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కూడా లేపాక్షి షో రూమ్ లను ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం లేపాక్షి  షోరూమ్ లు మొత్తం 17 ఉన్నాయని, వాటిలో రాష్ట్రంలో 14 ఉంటే, న్యూడిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లో ఒక్కొక్కటి చొప్పున మూడు  షోరూమ్ లు ఉన్నట్లు అధికారులు మంత్రి దష్టికి తెచ్చారు.


వీటి సంఖ్యను కూడా మరింత పెంచాల్సిన అవసరం ఉందని, ఎక్కడెక్కడ డిమాండు ఉందో ఆయా ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల రంగులద్దు శిక్షణా కేంద్రం మరియు షో రూమ్  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామ పరిశ్రమల బోర్డు పనితీరును మంత్రి సమీక్షిస్తూ ప్రధాన మంత్రి ఉపాధి హామీ కార్యక్రమాన్ని  రాష్ట్రంలో మరింత విస్తృత స్థాయిలో అమలు పర్చాలని లబ్దిదారుల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ ఏడాది 938 మంది లబ్దిదారులను లక్ష్యంగా నిర్థేశించుకోగా ఇప్పటికే 710 మంది ఈ పథకం క్రింద ఉపాధి కల్పించడం జరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.