Vijayawada News: విజయవాడ: ఏపీ పీసీసీ చీఫ్‌(PCC Chief)గా నేడు వైఎస్ షర్మిలా రెడ్డి()YS Sharmila బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తున్న సమయంలో ఆమె కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ వాహనాలతో ఏపీ కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్తుంటే ఎనికే పాడు వద్ద షర్మిల వాహనాలను పోలీసులు మళ్లించారు. కొన్ని వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. అ సమయంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని.. తన కాన్వాయ్ ను పోలీసులు అందుకే అడ్డుకున్నారని అన్నారు. ’భయపడుతున్నారా సార్’ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
విజయవాడ సీపీ కాంతి రానా రియాక్షన్ ఇలా..
విజయవాడలో షర్మిల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారన్న ప్రచారంపై సీపీ కాంతి రాణా(Kanthi Rana) స్పందించారు. కొన్ని మీడియాలలో దీనిపై తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగానే సిటీలోకి ఒకేసారి పెద్ద సంఖ్యలో కార్లని పోలీసులు అనుమతించలేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ తో కలిసి కొన్ని న్యూస్ ఏజెన్సీలు, కొన్ని సోషల్ మీడియా గ్రూపులు కలిసి ఏపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. 






మొదట గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి షర్మిల వాహనాలు బయలేదేరాయన్నారు. ఆమె వాహనంతో పాటు వెంట మరికొన్ని వాహనాలు వెళ్లిపోయాయని తెలిపారు. ఆ తరువాత మరో 50 నుంచి 100 వాహనాలు వెళ్తుంటే రెగ్యూలర్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఆ వాహనాలను ఆపినట్లు చెప్పారు. వాస్తవానికి అంత భారీ సంఖ్యలో వాహనాలను ఒక్కసారిగా అనుమతించరని, వెనుక వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేసినట్లు విజయవాడ సీపీ కాంతి రాణా వివరించారు. 


కేంద్రానికి తొత్తులుగా టీడీపీ, వైసీపీ!
బీజేపీ అధికారంలో 10 ఏళ్లు ఉండి... ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. అందులో ఏపీకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి వచ్చాయని ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు కాదు కదా... ఉన్న ఉద్యోగాలు ఊడి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. అప్పు లేని రైతు దేశంలో ఎక్కడా లేడు అని, దేశంలో బీజేపీ సర్కార్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఒక్క రైతు అకౌంట్ లో అయినా డబ్బులు పడ్డాయా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుంటే... టీడీపీ, వైసీపీ ఎందుకు తొత్తులుగా మారారు? రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీ లు బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నారని విమర్శించారు. కేంద్రానికి ఈ రెండు పార్టీలు తొత్తులు అయితే, టీడీపీ, వైసీపీకి మనం ఓట్లు ఎందుకు వేయాలని షర్మిల ప్రశ్నించారు.