Posani Krishna Murali Case: చంద్రబాబు సహా కూటమి నేతలను ఇష్టారీతిన అసభ్య పదజాలంతో దూషించిన సినీనటుడు పోసాని కృష్ణ మురళి కోర్టులో ఎమోషనల్ అయ్యారు. అనారోగ్యం వల్ల తాను నవడలేకపోతున్నానని న్యాయమూర్తికి తెలియజేశారు. ఏ కేసులో తనను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారో అర్థం కావడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్టెట్మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది. అనంతరం పోసానికి మార్చి 20 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు తెలియజేసింది. 


కర్నూలు టు విజయవాడ 


దూషణలు, సమాజంలో విభేదాలు సృష్టించేందుకు యత్నించారన్న కేసులో అరెస్టైన సినీనటుడు పోసాని కృష్ణమురళిని ఈ ఉదయం కర్నూలు జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చారు. పీటీ వారెంట్‌పై ఇక్కడ ఉన్న కేసుల్లో విచారించేందుకు పోలీసులు యత్నించారు. అందులో భాగంగా ఆయన్ని భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక విచారణ చేసిన తర్వాత వైద్య పరీక్షలు చేపట్టారు. అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టు ఎదుట హాజరుపరిచారు. జనసేన నేత శంకర్‌ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్టు కోర్టుకు తెలిపారు. ఆయన చంద్రబాబు, పవన్, లోకేష్‌ సహా వారి కుటుంబ సభ్యులపై దూషణలకు దిగారని కోర్టుకు వివరించారు.  


ఆరోగ్యం బాగాలేదని న్యాయమూర్తికి చెప్పిన పోసాని 


పోలీసుల పెట్టిన కేసులపై పోసాని రియాక్ట్ అయ్యారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని న్యాయమూర్తికి విన్నవించారు. తాను నడవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏ కేసులు పెడుతున్నారో తనను ఎందుకు తిప్పుతున్నారో అర్థం కావడం లేదని కూడా కోర్టుకు విన్నవించుకున్నారు. ఇప్పటికే రెండు చికిత్సలు జరిగాయని తెలిపారు. ఆయన స్టేట్మెంట్‌ను రికార్డు చేసిన న్యాయమూర్తి... మార్చి 20 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ని విజయవాడ జైలుకు తరలించారు.  


Also Read: ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం ! 


30కిపైగా ఫిర్యాదులు- 17 కేసులు 


పోసానిపై ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 30కిపైగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. దీంతో 17 ప్రాంతాల్లోకేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో విచారణలో భాగంగా ఆయా పోలీస్టేషన్ సిబ్బంది ఆయన్ని తీసుకెళ్లి విచారిస్తున్నారు. కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే నరసరావుపేటలో రిజిస్టర్ అయిన కేసులో ఆయన్ని కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.  


Also Read: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్‌- మార్కాపురంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి