ఏపీలో కొంత కాలంగా అత్యాచార ఘటనలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ నగరంలో అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. విజయవాడలో ఓ బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో భయపడిపోయిన ఆటో డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.


వారు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడుకు చెందిన ఓ బాలికకు బెంగళూరు వాసి అయిన ఆంజనేయులతో ఫేస్‌ బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆంజనేయులు విజయవాడకు వచ్చానని చెప్పడంతో అతణ్ని కలిసేందుకు బాలిక విజయవాడకు వెళ్లింది. అతణ్ని కలిసేందుకు ఆమె ఓ ఆటో డ్రైవర్‌ను ఆశ్రయించింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి ఉన్న హోటల్ వద్దకు తీసుకెళ్తానని చెప్పిన ఆటో డ్రైవర్‌ ఆ బాలికను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. 


బాలికను డ్రైవర్ ఆటో ఎక్కించుకుని నున్న ప్రాంతం సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేయబోయాడు. దీంతో బాలిక గట్టిగా అరుస్తూ కేకలు పెట్టింది. దీంతో భయపడిపోయిన ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులను సంప్రదించిన బాలిక వారి సాయం తీసుకొని కృష్ణలంకలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు, ఆటో నెంబరు సహా అన్ని వివరాలను సేకరించారు.


వాటి ఆధారంగా ఆటో డ్రైవర్‌ను విజయవాడలోని సింగ్ నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై కృష్ణలంక పోలీసులు మాట్లాడుతూ... సోమవారం ఉదయం ఈ అత్యాచార యత్నం జరిగిందని చెప్పారు. ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతణ్ని అరెస్ట్‌ చేశామని తెలిపారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన వ్యక్తి ఆంజనేయులను కూడా విచారణ కోసం పిలిచామని తెలిపారు. ఈ ఘటనలో అతని హస్తం ఉందేమో అనే కోణంలో పోలీసులు అతణ్ని కూడా పిలిచారు. అయితే, ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకే తాను బెంగళూరు వ్యక్తిని కలిసేందుకు వెళ్లినట్లుగా బాలిక పోలీసులతో చెప్పింది. అనంతరం ఆమెను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.