విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మరోసారి మంటగలిసింది. ప్రభుత్వం కోట్ల రూపాయలు వైద్య సదుపాయాలకు కేటాయిస్తున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పేద ప్రజలు నిత్యం అనేక అగచాట్లకు గురవుతున్నారు. పాలకులు, అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా బాలింతలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న వైనం కంటికి కనిపిస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తాజాగా ఆసుపత్రి దుస్థతి పై బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు సరైన బెడ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఒకే పడకపై ఇద్దరు బాలింతలను పడుకోబెట్టారు. అయినా దీన్ని అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం పొందలేని వారికి అంతగా ఆర్థిక స్థోమత లేకపోవడంతో రోజూ వందలాది మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం క్యూ కడుతున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి బాలింతలు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. అలాంటి వారికి ఎలాంటి సదుపాయాలు కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి ఖరీదు ఆయన వైద్యం పొందలేక ప్రభుత్వ దవాఖానాలో మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందనే నమ్మకంతో ఉన్న వారికి సరైన సదుపాయాలు కనిపించకపోవడంతో ఏమి చేయాలో తెలియక రోగులు, వారి కుటుంబ సభ్యులు అనేక అవస్థలు పడుతున్నారు. అదేంటని ప్రశ్నిస్తే వైద్యులతో పాటు వైద్య సిబ్బంది బాలింతలు, రోగులు, రోగులు బంధువులపై భౌతిక దాడులకు దిగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో పడకల కొరత సమస్యలు పరిష్కరించాలని పేషెంట్లు కోరుతున్నారు.
‘‘నాకు ఈరోజు ఉదయాన్నే ఆపరేషన్ జరిగింది. బెడ్లు ఖాళీ లేక కింద పడుకోబెట్టారు. అదేంటని సిబ్బందిని అడిగితే ఎందుకు వచ్చారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సపరేట్ రూం కావాలంటే ఇంకో ఆస్పత్రికి వెళ్లాలని కసురుకుంటున్నారు.’’ అని ఓ బాలింత వాపోయారు.
మరో మహిళ మాట్లాడుతూ.. ‘‘నాకు తీవ్రంగా నొప్పులు ఉన్నాయి. నిన్ననే ఆపరేషన్ చేశారు. ఒకే పడకపైన ఇద్దరిని పడుకోబెట్టారు. కనీసం అటు పక్కకి తిరగడానికి కూడా వీలు లేదు. ఒకే వైపు పడుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నాం’’ అని మరో మహిళా రోగి వాపోయారు.