సినీ నటి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి తెలుగుదేశం పార్టీకి మరోసారి రాజీనామా చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తానంటూ ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారామె.
రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు టీడీపీ దివ్యవాణి రాజీనామా చేశారు. మొన్నటికి మొన్న తాను రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాసేపటికే ట్వీట్‌ను డిలీట్ చేశారు. మళ్లీ తూచ్ అంటూ తాను రాజీనామా చేయలేదని కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ కవర్ చేశారు. చంద్రబాబుతో సమావేశమై తన సమస్యలు మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు. ఆయనతో సమావేశమైన తర్వాత మరోసారి రాజీనామా అంటూ కలకలం రేపారు.
పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తనకు వచ్చిన ఓ ట్వీట్‌ను చూసి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించానని సోమవారం ఉదయం ట్వీట్‌తో తొలిసారి రాజీనామా చేశారు దివ్యవాణి. తర్వాత ఆ ట్వీట్‌ను తీసేశారు. అయినా సరే ఆమె చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిపై వివరణ ఇచ్చిన ఆమె పొరపాటు జరిగిందని దివ్యవాణి క్లారిటీ ఇచ్చారు. పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఆమె చెప్పుకొచ్చారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రాజీనామా చేస్తున్నట్టు తొందరపాటుగా ప్రకటన చేశానంటూ చెప్పుకొచ్చారు.
పార్టీకి రాజీనామా చేశానని ట్వీట్ చేసిన తర్వాత తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని దివ్యవాణి వ్యాఖ్యానించారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికీ కృతజ్ఞతలని దివ్యవాణి వ్యంగంగా వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్ పెట్టానని దివ్యవాణి తెలిపారు. ఫేక్ ప్రచారాలకు తొందరపడొద్దని చంద్రబాబు సూచించారన్నారు.
ఇది జరిగిన 24 గంటల్లోనే చంద్రబాబుతో నేరుగా పార్టీ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. కాసేపు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో తనకు సహకరించిన వారందరికీ, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో రిలీజ్ చేశారు. అక్కడ మర్యాదలు తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్టు స్పష్టత ఇచ్చారు. అసలు చంద్రబాబుతో ఏమాట్లాడాను... ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.