తెలంగాణ(Telangana)కు చెందిన సయ్యద్ సమీర్ నవాజ్ ,మహమ్మద్ అలీమ్కు గొప్ప ఆలోచన వచ్చింది. కొన్ని కార్ల(Cars) కంపెనీలా ఆటో(Auto)లు అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందనే ప్లాన్ వారిలో మెదిలింది. అంతే వర్కౌట్ చేయాలనుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత స్టెప్పే వారిని దోషులను చేసింది.
అన్ని ఆటోలు ఒకేసారి కొంటే చాలా ఖర్చుతో కూడుకున్న యవ్వారం. అందుకే షార్ట్ కట్ వెతికారు సయ్యద్ సమీర్ నవాజ్, మహమ్మద్ అలీమ్. ఉన్న ఆటోలను చోరీ చేస్తే నెంబర్ ప్లేట్ మార్చేసి తిప్పుకోవచ్చు కదా అనే మాస్టర్ ప్లాన్ వేశారు.
తెలంగాణలో ఉన్న ఆటోలు చోరీ చేసి ఇక్కడే తిప్పితే పోలీసుల(Police)కు అనుమానం వస్తుందని మరో ఖతర్నాక్ ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఆటోలు చోరీ చేసి తెలంగాణలో తిప్పితే ఎవరికీ ఎలాంటి డౌట్స్ రావని స్కెచ్ గీశారు.
విజయవాడ(Vijayawada)ను టార్గెట్‌గా చేసుకున్నారు. భవానీపురం(Bhavani Puram), కృష్ణలంక(Krishna Lanka) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య కాలంలో చాలా ఆటోలు చోరీకి గురి అయ్యాయి. మారు తాళంతో ఆటోలు కొట్టేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వేల సీసీ కెమెరాల(CC Camer) ఫుటేజ్ పరిశీలించారు. చివరకు ఓ ఆటో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని చూశారు.
ఆ ఆటోపై నిఘా పెట్టినపోలీసులు ఆ నెంబర్ ఎవరిదా అని చూశారు. అసలు అలాంటి నెంబర్ గల ఆటో లేదని అదో నకిలీ నెంబర్ ప్లేట్ గా నిర్దారించుకున్నారు. దీంతో ఆటోల చోరీకి ఈ ఆటోకు సంబంధం ఉంటుందని ఎంక్వయిరీ చేశారు.
సయ్యద్ సమీర్ నవాజ్, మహమ్మద్ అలీమ్‌ను అరెస్టు చేశారు. వాళ్లు చెప్పిన ప్లాన్ విని పోలీసులు కంగుతిన్నారు. ఇప్పటికే తెలంగామలో ఎనిమిది ఆటోలు చోరీ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కచ్చితంగా ఈసారి ఆటోలు కొట్టేసి అద్దెకు ఇవ్వాలని డిసైడ్ అయ్యి విజయవాడపై ఫోకస్ పెట్టారు.
కొట్టేసిన ఆటోలను వైఎస్సార్ కాలనీ సమీపాన చెట్ల మధ్య దాచి ఉంచారు. చివరకు నెంబర్ ప్లేట్ మార్చి ఆటోలో తిరుగుతు ఇలా చిక్కారు. అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.
అనుమానితులు కనిపిస్తే పోలీసులకు చెప్పాలని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోయి ఉంటే ఈ కేసులు అంత ఈజీగా ఛేదించేవాళ్లం కాదన్నారు. అందుకే షాపులు, ఇళ్ల వద్ద, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.